నవంబర్ 8న నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించదానికి దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ, డిశంబర్ 30 గడువు ముగిసినందున శనివారం మళ్ళీ టీవీ మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఈరోజు ప్రసంగిస్తారని ప్రభుత్వం ప్రకటించగానే ఆయన దేశప్రజలకు వరాలు ప్రకటిస్తారని లేదా మళ్ళీ ఏవో కటినమైన నిర్ణయాలు ప్రకటిస్తారని లేదా ఈ నోట్ల రద్దు ద్వారా వచ్చిన నల్లధనాన్ని నిరుపేదల జన్ ధన్ ఖాతాలలో వేస్తారని రకరకాలుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ మోడీ అటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ నోట్ల రద్దు తరువాత దేశ ప్రజలు అందరూ ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వందేళ్ళ క్రితం మహాత్మా గాంధీజీ బ్రిటిష్ వారిపై పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చినప్పుడు వారు ఏవిధంగా స్పందించారో, ఇప్పుడు కూడా ప్రజలు అదే స్ఫూర్తి ప్రదర్శించి మంచిపని కోసం తాము ఎప్పుడూ సిద్దంగానే ఉంటామని నిరూపించి చూపారని మోడీ అభినందించారు.
ఇక బ్యాంకులో నగదు కొరత ఎప్పటిలోగా తీరబోతోంది...నగదు ఉపసంహరణపై ఆంక్షలు, నిబంధనలు వగైరాల ప్రస్తావనే చేయలేదు. అయితే వీలైనంత త్వరగా నగదు కొరత సమస్యని తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని చెప్పారు.
ఇక ప్రధాని మోడీ కొన్ని కొత్త పధకాలు, రాయితీలు ప్రకటించారు. ఆ వివరాలు:
1. పట్టణ ప్రాంతాలలో ఇళ్ళ నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణంపై వడ్డీ తగ్గించారు. రూ.9లక్షల వరకు రుణంపై 4 శాతం, రూ.12 లక్షల వరకు రుణంపై 3 శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
2. అదే..గ్రామీణ ప్రాంతాలలో రూ.2 లక్షల రుణంపై 3 శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
3. నగదు కొరత ఏర్పడిన కారణంగా రెండు నెలల వరకు రైతులు రుణాల చెల్లింపుకి సమయం ఇచ్చారు. అంతవరకు చెల్లించకపోయినా బ్యాంకులు వారిపై ఒత్తిడి చేయవు.
4. కో-ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రైతులు తీసుకొన్న రుణాలకి కూడా ఈ మినహాయింపు వర్తింపజేశారు.
5. రైతుల వద్ద గల కిసాన్ క్రెడిట్ కార్డులను వాపసు తీసుకొని రూపే కార్డులు ఇవ్వబడతాయి. వాటితో వారు అన్నిరకాల లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
6. గర్భవతులైన మహిళలకు పోషకాహారం, టీకాలు, వైద్య చికిత్స, ప్రసూతీ ఖర్చుల నిమిత్తం కేంద్రప్రభుత్వం వారి ఖాతాలలో రూ.6000 జమా చేస్తుంది.
7. బ్యాంకులలో ఫిక్స్ డిపాజిట్ వడ్డీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధుల కోసం మానవీయ కోణంలో చూసి మోడీ ఒక నిర్ణయం తీసుకొన్నారు. రూ.7.5 లక్షలలోపు డిపాజిట్లపై ఏడాదికి 8 శాతం వడ్డీ చొప్పున 10 ఏళ్ళు వరకు ఫిక్స్ చేశారు. ప్రభుత్వం లేదా బ్యాంకులు ఎటువంటి నిర్ణయాలు, పాలసీలు ప్రకటించినప్పటికీ ఈ వడ్డీని ఖచ్చితంగా అందించబడుతుంది.
8. ఇంతవరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోటి రూపాయల వరకు రుణం తీసుకొంటే దానికి కేంద్రప్రభుత్వమే గ్యారంటర్ గా నిలిచేది. ఇప్పుడు ఆ మొత్తాని రెండు కోట్లకు పెంచారు.
9. ఏడాదికి రూ.2 కోట్లు టర్నోవర్ కలిగిన వ్యాపారులకి ఇంతవరకు 8 శాతం పన్ను విదించబడేది. వారు డిజిటల్ పద్దతిలో లావాదేవీలు జరిపినట్లయితే 6 శాతంగా మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.