ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిపిఐ విమర్శలు

సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధకర్ రెడ్డి నిన్న హైదరాబాద్ లో రాష్ట్ర ప్రధాన కార్యాలయం మక్దూం భవన్ లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుని నిశితంగా విమర్శించారు.

 “నోట్ల రద్దు నిర్ణయం వలన రాష్ట్రంలో, దేశంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని వెనకేసుకు రావడం చాలా శోచనీయం. ఈ విషయంలో అనేకమంది భాజపా నేతలే ప్రధాని మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే, కేసీఆర్ మాత్రంగా గట్టిగా సమర్ధిస్తున్నారు. అయన తీరు చూస్తుంటే పూర్తిగా కేంద్రప్రభుత్వానికి లొంగిపోయినట్లే కనబడుతున్నారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో సామాన్య ప్రజల అభిప్రాయలు తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా కేంద్రప్రభుత్వానికి వంతపాడుతున్నారు. ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు దాని గురించి చాలా గొప్పగా చెప్పుకొంటున్నారు. ఇక నయీం కేసులో రాజకీయ నేతలకు, పోలీస్ అధికారులకు సంబంధాలు లేవని ప్రభుత్వమే న్యాయస్థానానికి గట్టిగా చెపుతోంది. ఆ కేసులలో తెరాస సర్కార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తోంది? ఎందుకు దాచిపెట్టాలనుకొంటోంది? ఆ కేసును సిబిఐకి అప్పగించడానికి ఎందుకు వెనుకాడుతోంది? రైతులకు ఎంతో మేలు చేసే భూసేకరణ చట్టం-2013ని పనికిరాని చట్టం అన్నట్లు ముఖ్యమంత్రి మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. జనవరి నెలంతా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి నోట్ల రద్దు నిర్ణయం వలన దేశానికి, ప్రజలకు కలిగిన నష్టాల గురించి అందరికీ వివరిస్తాము,” అని చెప్పారు.