తెలంగాణా ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిత్యం విమర్శలు గుప్పించే టీ-జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సృష్టిస్తున్న సమస్యల గురించి ఎందుకు ఎన్నడూ మాట్లాడారని తెరాస ఎంపి బాల్క సుమన్ ప్రశ్నించారు.
తెలంగాణా ఆవిర్భావానికి కొద్ది రోజుల ముందు ఖమ్మం జిల్లాకి చెందిన ఏడు మండలాలను ఏపిలో కలుపుతూ కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అదేవిధంగా పాలమూరు-డిండి ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపి కేంద్రప్రభుత్వానికి లేఖ వ్రాసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ లో సెక్షన్:8ని అమలు చేయాలని చంద్రబాబు గవర్నర్ పై ఒత్తిడి చేసినప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు మౌనం వహించారని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఓటుకి నోటు కేసు, ఎంసెట్ పరీక్షల నిర్వహణ, ఉమ్మడి ఆస్తులు, ఉద్యోగులు, నీళ్ళ పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేచీలు పెడుతున్నప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైకోర్టు విభజన జరుగకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుని ప్రొఫెసర్ కోదండరామ్ ఎందుకు నిలదీయడం లేదు? అని బాల్క సుమన్ ప్రశ్నించారు.
తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న వారిని నిలదీయడంమాని రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న తెరాస సర్కార్ పై ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శలు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ కి నిజంగా తెలంగాణా రాష్ట్రం మీద, తెలంగాణా ప్రజల మీద అంత ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఆయన చంద్రబాబు నాయుడుతో పోరాడాలని బాల్క సుమన్ హితవు పలికారు.