సుమారు రెండు
నెలలుగా అష్టకష్టాలు పడుతున్న దేశ ప్రజలకు శుభవార్త. జనవరి 1 నుంచి ఎటిఎంలలో నుంచి
రోజుకి రూ.4500 నగదు విత్ డ్రా చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న
ప్రకటించింది. పాత నోట్లను బ్యాంకులలో జమా చేసుకొనే గడువు నిన్నటితో ముగియడంతో రిజర్వ్
బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఇంతవరకు ఎటిఎంల నుంచి రోజుకి రూ.2000 మాత్రమె తీసుకొనే
అవకాశం ఉండేది. దానిని రేపటి నుంచి రూ.4500 కు పెంచుతున్నట్లు ప్రకటించింది. కానీ
బ్యాంకుల నుంచి రోజుకి రూ.4,000 చొప్పున వారానికి రూ.24,000 పరిమితిని మాత్రం
పెంచలేదు. బ్యాంకులకు ఇంకా సరిపడినంత కరెన్సీ చేరకపోవడమే అందుకు కారణంగా
భావించవచ్చు.
ఎటిఎంల నుంచి నగదు
విత్ డ్రా పరిమితిని పెంచడం ప్రజలకు చాలా ఊరట కలిగించే విషయమే. అయితే నేటికీ
దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎటిఎంలు అనేక వారాలుగా తెరుచుకోవడం లేదు. జన సామర్ధ్యం
ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాలు, ప్రదేశాలలో తెరిచి ఉన్న ఎటిఎంల వద్ద నేటికీ పెద్ద
క్యూలైన్లు కనబడుతూనే ఉన్నాయి. అయితే నగదు విత్ డ్రా పరిమితిని రూ.4500కు పెంచడం
వలన ఇక నుంచి ప్రజలకు ఎటిఎంలలో రూ.100 లేదా 500 నోట్లు లభించే అవకాశం ఉందని స్పష్టం
అవుతోంది. అదేవిధంగా నగదు సరఫరా, లభ్యత కూడా పెరిగిందని అర్ధం అవుతోంది. రిజర్వ్
బ్యాంక్ చెప్పినట్లుగా ప్రజలకు ఈ మాత్రం కరెన్సీని అందించగలిగినా ఇక నుంచి బ్యాంకులు,
ఎటిఎంల వద్ద క్యూ లైన్లు తగ్గుముఖం పట్టవచ్చు. బ్యాంకులపై కూడా ఒత్తిడి తగ్గవచ్చు.