పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడులతో మొదలైన 2016 సంవత్సరం ముగుస్తున్న సమయంలో కూడా దేశ ప్రజలకు మరొక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఝార్ఖండ్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఒక బొగ్గు గని కూలిపోవడం దానిలో సుమారు 10-15 మంది కార్మికులు చిక్కుకుపోయారు. నిన్న రాత్రి నుంచి ముమ్మురంగా సహాయ చర్యలు మొదలుపెట్టారు. ఇంతవరకు ఏడుగురు కార్మికుల శవాలను వెలికి తీయగలిగారు.
రాష్ట్రంలో గొడ్డా జిల్లాలోగల ఈసీఎల్ కు చెందిన రాజ్ మహల్ ప్రాజెక్టులో నిన్న రాత్రి సుమారు 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మెషిన్లతో బొగ్గు త్రవ్వకం పనులు జరుపుతుండగా నెల క్రుంగడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు ఈస్ట్రన్ అండ్ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు.
ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు, రాష్ట్ర గనులశాఖ సహాయ సిబ్బంది, ఆ గనులలో పనిచేస్తున్న కార్మికులు శిధిలాలల తొలగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితి గురించి సమాచారం తెలుసుకొంటున్నారు. కార్మికులు చనిపోయినందుకు వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయ చర్యలు ముమ్మురంగా సాగుతున్నాయి. అక్కడ చేరిన కార్మికుల కుటుంబాలు రోదనలతో చాలా విషాదకర వాతావరణం నెలకొని ఉంది. కనీసం మిగిలినవారైనా ప్రాణాలతో బ్రతికి బయటపడితే చాలని అందరూ కోరుకొంటున్నారు.