కొద్ది సేపటి క్రితం తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి కార్యాలయంలో అయన అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం మొదలైంది. శాసనసభ స్పీకర్ తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ నిన్న శాసనసభ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్షాలు ఈ సమావేశానికి హాజరవడం విశేషం. తెరాస తరపున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, కాంగ్రెస్ తరపున మల్లు భట్టి విక్రమర్క, జానారెడ్డి, తెదేపా తరపున సండ్ర వెంకట వీరయ్య సిపిఎం తరపున సున్నం రాజయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
రేపటితో శాసనసభ సమావేశాలు ముగిసిపోతాయి కనుక వాటిని ప్రతిపక్షాలు సూచన మేరకు జనవరి 15 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఆ అంశంతో బాటు, ఆ సమావేశాలలో చర్చించవలసిన అంశాల అజెండాను కూడా ఖరారు చేస్తారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సమావేశాలు కొనసాగించడానికి సంసిద్దత వ్యక్తం చేస్తుంటే వాటిలో పాల్గొనడానికి ప్రతిపక్షాలు తడబడుతుండటమే విశేషం. భూసేకరణ బిల్లుపై మాత్రం అన్ని పార్టీలు ప్రభుత్వంతో గట్టిగా పోరాడాయని చెప్పవచ్చు. ఇక ముందు జరుగబోయే సమావేశాలలో అవి ఏవిధంగా వ్యవహరిస్తాయో చూడాలి.