ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావుకి బ్యాంక్ జలక్

ఏపి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు బందువులు, వ్యాపార భాగస్వాములకు చెందిన ప్రత్యూషా రిసోర్సస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.196.50 కోట్లు బాకీ తిరిగి చెల్లించకపోవడంతో వారు హామీగా ఉంచిన ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకొంది. ఆ సంస్థ విస్తరణ నిమిత్తం విశాఖలోని ఇండియన్ బ్యాంక్ (డాబా గార్డెన్స్ బ్రాంచి) నుంచి వారు రూ.141,68, 07,584 రుణం తీసుకొన్నారు. అది వడ్డీతో కలిపి రూ.196,51,00,717 అయ్యింది. దానిని చెల్లించాలని బ్యాంక్ ఎన్ని నోటీసులు పంపించినా ప్రత్యూషా సంస్థ స్పందించలేదు. ఆ సంస్థలో మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కర రావు, అయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకర రావు డైరెక్టర్లుగా ఉన్నారు. వారి సంస్థ చేసిన ఈ అప్పుకు మంత్రి గంటా శ్రీనివాస రావు, నార్నే అమూల్య, కొండయ్య, బాల సుబ్రహ్మణ్యం హామీదారులుగా ఉన్నారు. వారికి చెందిన ప్రత్యూషా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూషా గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ హామీదారులుగా ఉన్నాయి. కాకినాడ, విశాఖలోని పలు ప్రాంతాలలో గల వారి ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించింది. వాటిపై ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, జరిపినట్లయితే వారు కూడా ఆ బకాయిలకు బాధ్యులవుతారని బ్యాంక్ హెచ్చరించింది.

దీనిపై మంత్రి గంటా స్పందిస్తూ ఆ సంస్థల నుంచి తను చాలా కాలం క్రితమే బయటకు వచ్చేశానని, వాటి బకాయిలతో తనకు ఎటువంటి సంబందమూ లేదని చెప్పారు. కానీ ఆ బకాయిలు చెల్లించమని చెపుతానని అన్నారు. 

ఇదివరకు తెదేపా ఎంపి, కేంద్రమంత్రి సుజన చౌదరికి చెందిన సంస్థలు మారిషస్ బ్యాంక్ కు సుమారు రూ.103 కోట్లు ఎగవేసినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఆయన స్పందించకపోవడంతో కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంటు కూడా జారీ చేసింది. ఇప్పుడు తెదేపాకే చెందిన మరో మంత్రి గంటాపై కూడా అటువంటి అవినీతి ఆరోపణలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే అదునుగా జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఖాయం. వాటి వలన తో తెదేపా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారవచ్చు.