జనవరి 15వరకు శాసనసభ సమావేశాలు?

ఈసారి రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు అజెండాను ఖరారు చేసే సమయంలోనే ఈ సమావేశాలలో మాట్లాడేందుకు ప్రతిపక్షాల వద్ద బలమైన అంశాలు ఏవీ లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట నిజమని నిరూపిస్తున్నట్లుగా కాంగ్రెస్, తెదేపా, సిపిఎం సభ్యులు శాసనసభని బహిష్కరించి వెళ్ళిపోయారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 15వరకు (పండుగ శలవులను మినహాయించి) శాసనసభ సమావేశాలు కొనసాగించాలనే ఉద్దేశ్యం వ్యక్తపరచడం విశేషం. ఆయన ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎప్పుడూ వెనుకాడమని, అలాగే ప్రతిపక్షాలు కూడా ఆ చర్చలో పాల్గొని తమ ప్రభుత్వానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుకొంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలపై, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, వాటి ప్రజా సమస్యలపై సభలో అర్ధవంతమైన చర్చ జరిగి ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలనుకొంటున్నట్లు చెప్పారు.

ప్రతిపక్షాలు తమ మొండి పట్టుదల వీడి సమావేశాలకు హాజరయ్యి వివిధ అంశాలు, సమస్యలపై తమ అభిప్రాయలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఒకవేళ అవసరమనుకొంటే జనవరి 15 తరువాత కూడా సమావేశాలు కొనసాగించడానికి తమకేమి అభ్యంతరం లేదని కానీ సమావేశాలలో ప్రజలకి ప్రయోజనం కలిగించే విధంగా చర్చలు, నిర్ణయాలు జరిగినప్పుడే సభకు, దానిలో సభ్యులకు గౌరవంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలు, సభ నడిపిస్తున్న తీరు పూర్తి విరుద్దంగా ఉన్నాయని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సభలో తమని మాట్లాడేందుకు అవకాశం ఈయకుండా, తమ అభ్యర్ధనలను, సలహాలను, సూచనలను పట్టించుకోకుండా సభని తనకి నచ్చినట్లు స్పీకర్ ద్వారా నడిపించుకొంటున్నారని, స్పీకర్ మధుసూదనాచారి కూడా తెరాస ప్రతినిదిలాగే వ్యవహరిస్తున్నారు తప్ప నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.