తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజాహిత పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన తమిళనాడు హైకోర్టు కూడా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేయసింది. జస్టిస్ వైద్యనాధన్, జస్టిస్ పార్దిబన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జయలలిత మృతిపై ఇవ్వాళ్ళ విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా జస్టిస్ వైద్యనాధన్ ప్రభుత్వ న్యాయవాదిపై అనేక ప్రశ్నలు సందించడమే కాకుండా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.
సుమారు మూడు నెలలుపైగా జయలలితని ఆసుపత్రిలో ఉంచినప్పుడు, ఆమెని ఎవరూ ఎందుకు కలవనీయలేదని, కనీసం ఆమె ఫోటోలు, వీడియో ఎందుకు విడుదల చేయలేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎందుకు అంత గోప్యత పాటించారని పిటిషనర్ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాలని కోరారు. ఆమె మరణంపై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. అయితే అది తమ వ్యక్తిగత అభిప్రాయమేనని కానీ ఒకవేళ తను ఒక్కడే ఈ కేసుని విచారించి ఉండి ఉంటే వేరే విధంగా వ్యవహరించి ఉండేవాడినని చెప్పారు. జయలలిత విషయంలో చాలా అనవసరమైన గోప్యత పాటించడమే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఆమెకి అందించిన వైద్యం, ఆమె విషయంలో గోప్యత పాటించడానికి, ఆమె మరణానికి గల కారణాలను వివరిస్తూ జనవరి 9లోగా పూర్తి నివేదిక తమకు అందించాలని హైకోర్టు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు, అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.