తెలంగాణా జేయేసి అద్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద జరుపతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా దానికి హాజరయ్యేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండటాన్ని నిరసిస్తూ టీ-జేయేసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాద్ లోని తన నివాసంలోనే మౌన దీక్ష చేపట్టారు. అరెస్ట్ చేసినవారినందరినీ తక్షణమే విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ సంగతి తెలుసుకొన్న టీ-జేయేసి నేతలు ప్రొఫెసర్ కోదండరామ్ నివాసానికి చేరుకొంటున్నారు. వారు అక్కడే సమావేశమయ్యి తమ కార్యాచరణని నిర్ణయించుకొని మరికొద్ది సేపటిలో ఒక ప్రకటన చేయబోతున్నారు.
ఒకపక్క టీ-జేయేసి తెరాస సర్కార్ పై యుద్ధభేరి మ్రోగిస్తుంటే, మరోపక్క ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై, స్పీకర్ మధుసూధనాచారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీ-జేయేసి, ప్రతిపక్షాలు కూడా తెరాస సర్కార్ ఆమోదించిన భూసేకరణ బిల్లుని వ్యతిరేకిస్తూనే పోరాడుతున్నాయి కనుక బహుశః అందరూ చేతులు కలిపి ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.