ఈరోజు శాసనసభ సమావేశాలను కాంగ్రెస్, తెదేపా, సిపిఎం పార్టీ సభ్యులు బహిష్కరించారు. స్పీకర్ మధుసూధనాచారి సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నదుకు నిరసనగా తాము సమావేశాలను బహిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. భాజపాని కూడా తమతో కలిసి రావాలని అభ్యర్ధించినప్పటికీ, భాజపా సభ్యులు అంగీకరించలేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన స్పీకర్ మధుసూధనాచారి తెరాస ప్రతినిధిలాగ వ్యవహరిస్తుండటం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి అన్నారు. భూసేకరణ బిల్లుపై తమ అభిప్రాయలు చెప్పేందుకు, దానిపై తమ నిరసన తెలిపేందుకు కూడా స్పీకర్ తమకి అవకాశం ఇవ్వకపోవడాన్ని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఆయన తీరుని నిరసిస్తూ నేడు సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.
రెండు రోజుల క్రితమే సభ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేసి సభలోకి అనుమతించారు. ఇప్పుడు ప్రతిపక్షాలే సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోవడం చాలా విచిత్రంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు శాసనసభ సమావేశాలను నిర్వహించాలనుకొన్నప్పుడు, ప్రజా సమస్యలపై చర్చించడానికి ఆ సమయం సరిపోదు. కనీసం రెండు మూడు వారాలైనా నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వాటి అభ్యర్ధన మేరకు అవసరమైతే మరొక వారం రోజులు పొడిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఈ నెలాఖరు వరకు జరిగే సమావేశాలకు కూడా హాజరుకాకుండా ప్రతిపక్షాలు ఏదో కుంటి సాకుతో తప్పించుకొని పారిపోతున్నాయి.