తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ నటరాజన్ కే దక్కాయి. ఈరోజు ఉదయం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఆ పార్టీ అధికారిక వెబ్ సైట్ లో కూడా ప్రకటించేశారు. తన ప్రత్యర్ధులు ఎవరూ నామినేషన్లు వేయకుండా శశికళ వర్గం చాలా జాగ్రత్తలు తీసుకొంది. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయం అనే రీతిలో చెన్నైలో చాలా చోట్ల ఆమె ఫోటో ఉన్న బ్యానర్లు, పార్టీ జెండాలు, దర్శనమిచ్చాయి. కీలకమైన ఈ సమావేశంలో ఆమె ప్రత్యర్ధులు ఎవరూ నోరు విప్పే అవకాశం లేకుండా చేసి శశికళ పార్టీపై తన పట్టు నిరూపించుకొన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవిని కూడా ఆమే చేపట్టబోతున్నారా లేదా అనే విషయం త్వరలోనే తేలిపోతుంది. ఒకవేళ ఆమె అటువంటి ప్రయత్నం చేస్తే పార్టీ నిలువునా చీలిపోయే అవకాశం కూడా ఉంది.