జి.హెచ్.ఎం.సి.పరిధిలో అక్రమ కట్టడాల నిర్మాణాలని నియంత్రించేందుకు రూపొందించిన ట్రిబ్యునల్ బిల్లుపై బుదవారం శాసనసభలో లోతుగా చర్చ జరిగిన తరువాత దానికి ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. సాధారణంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పు పడుతూ, దానిపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తుంటాయి కానీ ఈరోజు సమావేశంలో ఈ బిల్లులోని లోటుపాట్లు, అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణల గురించి అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు చాలా లోతుగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం.
మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ ఆ బిల్లుని సభలో చర్చకు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొన్నారు. ఈ బిల్లు ద్వారా ట్రిబ్యునల్ (ప్రత్యేక న్యాయస్థానం) ఏర్పాటు చేయబడుతుంది. అది కేవలం జి.హెచ్.ఎం.సి.పరిధిలో నిర్మించబడుతున్న అక్రమ కట్టడాల తొలగింపులో ఏర్పడే న్యాయవివాదాల పరిష్కారం కోసమే పనిచేస్తుంది. కానీ రోడ్ల విస్తరణ కోసం జరిగే ఇళ్ళ కూల్చివేతలకు సంబందించిన కేసులను ఈ ట్రిబ్యునల్ స్వీకరించదు. ట్రిబ్యునల్ తీర్పుని వ్యతిరేకించేవారు దానిపై హైకోర్టులో అప్పీలు చేసుకొనే వీలుంటుంది.
ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు డా.లక్ష్మణ్ మాట్లాడుతూ “అక్రమ కట్టడాల కూల్చివేయాలనే ఆలోచన చేయడం కంటే అసలు వాటి నిర్మాణాలను మొదట్లోనే అడ్డుకొనే ప్రయత్నం చేస్తే ఎవరికీ నష్టం ఉండదు. అలాగే లంచాలు తీసుకొని అక్రమ కట్టడాల నిర్మాణాలకి అనుమతులిస్తున్న అధికారులపై కూడా కటినంగా శిక్షించాలి. పైసాపైసా కూడబెట్టుకొని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు కొనుకొనే ఇళ్ళు అక్రమ కట్టడాలని గుర్తించినప్పుడు వారు దానికి తగిన పరిహారం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకొనే అవకాశం కల్పించాలి,” అని సూచించారు.