పాతనోట్లపై కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయం

మార్చ్ 31 తరువాత తరువాత ఎవరి దగ్గరైనా రూ.500 లేదా రూ.1,000 నోట్లు 10కి మించి ఉన్నట్లయితే వారి వద్ద ఉన్న మొత్తానికి 10 రెట్లు జరిమానా వేయాలని కేంద్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేయబోతోందని జాతీయ మీడియాలో వచ్చిన వార్తలని నిజమని నిరూపిస్తూ కొద్ది సేపటి క్రితమే కేంద్రప్రభుత్వం దాని కోసం ఒక ఆర్డినెన్స్ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానే అది అమలులోకి వస్తుంది.  

ఇంతవరకు రూ. 15.4 లక్షల కోట్లు విలువ గల డబ్బు మార్కెట్లో చలామణిలో ఉండగా దానిలో సుమారు 3 లక్షల కోట్లు ఇంతవరకు బ్యాంకులకు చేరలేదు. అంటే ఆ సొమ్ము అంతా నల్లధనమేనని స్పష్టం అవుతోంది. ఈ నెల 30లోగా నల్లకుభేరులు తమ వద్ద ఉన్న నల్లధనం వివరాలను స్వచ్చందంగా ప్రకటించడానికి  కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే భయంతో ఎవరూ ముందుకురావడం లేదు.

వారి వద్ద ఉన్న ఆ డబ్బుని డిశంబర్ 31 నుంచి మార్చి 31వరకు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కౌంటర్లలో మార్చుకోవచ్చని కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ దానికి అన్ని లెక్కలు చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నల్లధనం జమా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై ఐటి, ఈడి దృష్టి పడే అవకాశం ఉంది. కనుక ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకోని వారి వద్ద పేరుకు పోయిన నల్లధనం ఇక ఎన్నడూ బ్యాంకులకి చేరే అవకాశం ఉండదు. అది మార్కెట్లలో ఉండిపోతే ఆర్ధిక వ్యవస్థకి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కనుక వాటిని చలామణిలో నుంచి తొలగించడం కోసం ఇటువంటి కటినమైన చట్టం అవసరం ఉంటుంది.