ప్రధాని గడువు ముగిసింది కానీ..

నవంబర్ 8న పాత పెద్ద నోట్లని రద్దు చేస్తూ దాని వలన ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోయి, మళ్ళీ దేశంలో సామాన్యపరిస్థితులు ఏర్పడటానికి తనకి 50 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. ఆ గడువు నేటితో ముగిసిపోతుంది. ఇక పాత నోట్ల ఆయువు మరొక రెండు రోజులలో అంటే డిశంబర్ 30 అర్దరాత్రితో ముగిసిపోబోతోంది. కానీ దేశంలో ఇక నగదు కొరత ఇంకా అలాగే ఉంది. ఆ కారణంగా సామాన్య ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారి ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి.

అది గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రులు కొత్త పల్లవి అందుకొన్నారు. తాము చెప్పిన 50 రోజుల గడువు తరువాత నుంచి సామాన్య ప్రజల ఇబ్బందులు క్రమంగా తగ్గిపోయి నల్లకుభేరులకి కష్టాలు మొదలవుతాయని చెపుతున్నారు. అంటే 51వ రోజున ప్రజల కష్టాలన్నీ మంత్రదండం తిప్పి మాయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నట్లే భావించవచ్చు.

ఈ నోట్ల కష్టాలకి నోట్ల రద్దు ఒక కారణమయినప్పటికీ అవి ఇంకా కొనసాగడానికి నల్లకుభేరుల చేతివాటమేనని ఇప్పుడు ప్రజలకు కూడా అర్ధం అయ్యింది. కనుకనే వారికి డిశంబర్ 31  నుంచి కొత్త కష్టాలు మొదలవుతాయని చెప్పి ప్రజలను ఆగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చలార్చే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. సువిశాలమైన భారతదేశంలో అవినీతిపరులను ఏరిపడేయడం అంత సులువైన పని కాదని ఈ 50 రోజులలోనే నల్లకుభేరులు మోడీకి కూడా అర్ధమయ్యేవిధంగా తెలియజెప్పారని భావించవచ్చు. కనుక తమ  ఏరివేతకు ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న వ్యవస్థలు ఏమాత్రం సరిపోవనే విషయం కూడా నల్లకుభేరులు నిరూపించి చూపారు. కనుక కేంద్రప్రభుత్వం అందుకు తగ్గ బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని అవినీతి, నల్లధనంపై తన యుద్ధం కొనసాగించడం మంచిది.  

ఈ నోట్ల రద్దుతో నల్లధనం వెలికివస్తుందా లేదా? అనే విషయంతో సామాన్య ప్రజలకు సంబంధం లేదు. దాని వలన తమ రోజువారి జీవనానికి ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతేచాలని కోరుకొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఆర్ధిక శాఖ చెపుతున్నదాని ప్రకారం జనవరి నెలాఖరుకల్లా ఈ నగదు కొరత సమస్య చాలా వరకు తీరిపోవచ్చని గట్టిగా చెపుతున్నాయి. కనుక అంతవరకు భరించక తప్పదని అర్ధం అవుతోంది. చిన్నచిన్న పట్టణాలలో క్రమంగా బ్యాంకులు ఎటిఎంల వద్ద క్యూలైన్లు తగ్గుతుండటం గమనిస్తే ప్రధాని నరేంద్ర మోడీ, రిజర్వ్ బ్యాంక్ హామీలని నమ్మవచ్చనిపిస్తోంది.