ఇందిరమ్మ ఇళ్ళ రుణాలు మాఫీ: కేసీఆర్

ఈరోజు శాసనసభలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాడివేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయంలో పేదల కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ గురించి కాంగ్రెస్ సభ్యులు గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వారి గాలి తీసేశారు.

“వాటిలో చాలా వరకు అనర్హులకే వెళ్ళాయి. వాటి పేరు చెప్పుకొని కాంగ్రెస్ నేతలే అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వాటిని పొందిన పేదలు నేటికీ తమవంతు బాకీలను చెల్లిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ హయంలో బాకీలు చెల్లించలేని పేదల ఇళ్ళ తలుపులను అధికారులు పీక్కొని వెళ్ళిన మాట నిజమా కాదా? ఇప్పుడు మా ప్రభుత్వం కూడా పేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తోంది కనుక గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళు పొందిన పేదలు చెల్లిస్తున్న మొత్తం బాకీలను మాఫీ చేస్తున్నామని సభా ముఖంగా ప్రకటిస్తున్నాను. అది మొత్తం రూ.3920 కోట్లు ఉన్నట్లు తేలింది. వారి తరపున ఆ బాకీ మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాగే రాజీవ్ స్వగృహ పధకం క్రింద బకాయిలను కూడా రద్దు చేస్తున్నాం,” అని కేసీఆర్ ప్రకటించారు.  

ఇది కాంగ్రెస్ నేతలు ఊహించని ప్రకటనే అని చెప్పక తప్పదు. తమ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ స్వగృహ పధకాలలో లబ్దిదారులు నేటికీ అప్పుల ఊబిలో కూరుకుపోయి మౌనంగా విలపిస్తుంటే, తెరాస సర్కార్ చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళపై రాళ్ళూ విసురుదామని ప్రయత్నించిన  కాంగ్రెస్ నేతలు, తమ వైఫల్యాలకి తెరాస సర్కార్ మూల్యం చెల్లిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను సవాలు చేయలేరు..జవాబు చెప్పలేరు కనీసం తమ ప్రభుత్వ వైఫల్యాన్ని పైకి చెప్పుకోలేరు.