ఇవ్వాళ్ళ దేశంలో ఒకేసారి రెండు అతిపెద్ద విమానప్రమాదాలు త్రుటిలో తప్పిపోయాయి. మొదటిది గోవాలో కాగా రెండవది దేశరాజధాని డిల్లీలో జరిగింది.
గోవా నుంచి ముంబై వెళ్ళవలసిన జెట్ ఎయిర్ వేస్ సంస్థకి చెందిన (నెంబర్: 2374) విమానం డబ్లిం విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా రన్ వే పై నుంచి పక్కకు జారిపోయింది. ఆ సమయంలో విమానంలో 154మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు విమానానికి, వారికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. రన్ వేని తాత్కాలికంగా రెండు గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక డిల్లీలో ఒకే రన్ వేపైకి రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. కానీ రెండు విమానాలలో పైలట్లు అప్రమత్తం అయ్యి వెంటనే తమ విమానాలను నిలిపివేయడంతో ఘోరమైన ప్రమాదం త్రుటిలో తప్పింది.
డిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్న స్పైస్ జెట్ విమానానికి అదే రన్ వేపై ఇండిగో విమానం ఎదురయ్యేసరికి పైలట్లు షాక్ అయ్యారు. అది లక్నో నుంచి డిల్లీ వచ్చింది. దానిలో 160మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా, హైదరాబాద్ బయలుదేరుతున్న స్పైస్ జెట్ విమానంలో 187మంది ప్రయాణికులున్నారు. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పొరపాటు వలననే జరిగినట్లు అనుమానిస్తున్నారు లేకుంటే రెండు విమానాలు ఎదురెదురుగా ఒకే రన్ వేపైకి వచ్చే అవకాశమే లేదు. ముందుగా స్పైస్ జెట్ విమాన పైలెట్లు ఈ సంగతి గుర్తించి తమ విమానాన్ని నిలిపివేసి ఎదుట విమానం పైలెట్లని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లని హెచ్చరించడంతో అందరూ వెంటనే అప్రమత్తమవడంతో ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. పౌర విమానసేవలను నియంత్రించే డి.జి.సి.ఎ. వెంటనే దీనిపై దర్యప్తుకి ఆదేశించింది.