కాంగ్రెస్ ద్వంద వైఖరి: హరీష్ రావు

రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు శాసనమండలి సాక్షిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల, వాటి పనుల పురోగతి, సమగ్ర నివేదికల గురించి కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం చెపుతూ అందరికీ గట్టిగా చురకలు వేశారు. 

“ఇక్కడ శాసనసభ, మండలిలో ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయని మమ్మల్ని అడుగుతుంటారు. వాటి లెక్కలు, పురోగతి, ప్రాజెక్టు నివేదికల గురించి ప్రశ్నిస్తుంటారు. కానీ వాటి కోసం మా ప్రభుత్వం భూసేకరణ చేయడానికి పూనుకొంటే మళ్ళీ అడ్డుపడుతుంటారు. కోర్టులలో కేసులు కూడా వేస్తుంటారు. మీ పద్ధతి ఎలాగుంది అంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంది. మీరు నిజంగా ప్రాజెక్టులు నిర్మించాలని కోరుకొంటున్నట్లయితే వాటికి ఎందుకు అడ్డుపడుతున్నారు? ఒకవేళ అవి వద్దనుకొంటున్నట్లయితే మళ్ళీ వాటి పురోగతి గురించి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు?” అని హరీష్ రావు కాంగ్రెస్ సభ్యులను నిలదీశారు. 

హరీష్ రావు అడిగిన ఈ ప్రశ్నలకు బహుశః కాంగ్రెస్ సభ్యుల వద్ద సంతృప్తికరమైన సమాధానాలు ఉండకపోవచ్చు. భూసేకరణ చట్టం-2013 ప్రకారమే నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. అయితే నిర్వాసితులకు అంతకంటే మెరుగయిన ప్యాకేజీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం వేరేగా ఒక జివో:123ని విడుదల చేసింది. దానిని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్ వేయడంతో భూసేకరణలో ఆలస్యం జరిగింది. కాంగ్రెస్ నేతలు అక్కడ భూసేకరణ జరుపకుండా అడ్డుకొన్నప్పుడు మళ్ళీ ఇవ్వాళ్ళ శాసనమండలిలో ఆ ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే హరీష్ రావు వారికి కొర్రు కాల్చి వాతపెట్టినట్లు సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా పాలమూరు-డిండి ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పారు. అలాగే నదీ జలాల వాడకంలో కూడా రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటా కోసం ట్రిబ్యునల్స్ లో గట్టిగా పోరాడుతామని చెప్పారు.