రాజకీయాలలో ఒక్కోసారి చాలా చిన్న చిన్న పొరపాట్లకి బారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంటుంది. అందుకు తాజా ఉదాహరణగా యూపిలోని బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి చేసిన తప్పిదం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.
నోట్ల రద్దు తరువాత బ్యాంకులలో ఒక పరిమితికి మించి డబ్బు జమా చేసినట్లయితే వాటిపై ఆదాయపన్ను, ఈడి అధికారుల కన్ను పడుతుందని సామాన్య ప్రజలకి కూడా తెలుసు. కనుక రాజకీయాలలో కొమ్ములు తిరిగిన బి.ఎస్.పి అధినేత్రి, యూపి మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఈ సంగతి తెలియదనుకోలేము. కానీ నోట్ల రద్దు తరువాత ఆమె సోదరుడి ఖాతాలో రూ1.43 కోట్లు, పార్టీ ఖాతాలో రూ.104కోట్లు జమా చేశారు. డిల్లీలో కరోల్ బాగ్ లోగల యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ నగదు జమా అయ్యింది. ఊహించినట్లుగానే ఇది ఈడి దృష్టిలో పడింది. ఆ ఖాతా వివరాలు, ఆ నగదు జమా అయిన తేదీలలో బ్యాంకులలో రికార్డ్ అయిన సిసి ఫుటేజి వగైరాలన్నీ అందించవలసిందిగా సదరు బ్యాంక్ అధికారులను ఈడి కోరింది. వాటి ఆధారంగా మాయావతికి, ఆమె సోదరుడుకి త్వరలోనే నోటీసులు జారీ చేయబోతున్నారు.
నోట్ల రద్దుని గట్టిగా వ్యతిరేకించిన వారిలో మాయావతి కూడా ఒకరు. నోట్ల రద్దు వలన సామాన్య ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు తప్ప నల్లకుభేరులకి ఎటువంటి నష్టం జరుగలేదని ఆమె ఇన్ని రోజులుగా వాదించారు. ఇప్పుడు ఆమె పార్టీ బ్యాంక్ ఖాతాలోనే 104 కోట్లు నగదు జమా చేయడంతో ఆమె దానికి సరైన లెక్కలు, ఆధారాలు చెప్పవలసి ఉంటుంది.
యూపిలో మరొక 3నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి కీలకమైన సమయంలో ఇంత బారీగా నల్లధనం పట్టుబడటంతో భాజపా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఎన్నికల ప్రచార సభలో ఆమె అవినీతిని ఎండగట్టవచ్చు. అదే సమయంలో ఈడి ద్వారా ఆమెపై ఒత్తిడి పెంచవచ్చు. ఇప్పటికే పెద్ద నోట్లు రద్దు కారణంగా ఆమెకి చాల పెద్ద ఎదురుదెబ్బ తగిలి ఉండవచ్చు. ఇప్పుడు దీని వలన మరో ఎదురుదెబ్బ తినక తప్పదు. యూపిలో అధికార సమాజ్ వాదీ పార్టీ, చిన్న చితకా రాజకీయ పార్టీలు కూడా ఈ నోట్ల రద్దు కారణంగా ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నాయి.