అబ్బాయేమో ముఖ్యమంత్రి! కనుక అయన ఓ జాబితా విడుదల చేశాడు. ఇక బాబాయ్ ఏమో పార్టీ అధ్యక్షుడు! కనుక ఆయన కూడా మరో జాబితా విడుదల చేసేశాడు. ఇంతకీ ఈ జాబితాలు..గొడవ ఏమిటంటే వచ్చే ఏడాది మార్చిలో జరుగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మొత్తం 402 స్థానాలకు పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసేశారు. అయన చిన్నాన్న శివపాల్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కనుక అయన కూడా ఓ జాబితా తయారు చేసేశాడు.
ఆ రెండు జాబితాల గురించి అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఆ జాబితాలలో అభ్యర్ధులు అప్పుడే జనాలలోకి వెళ్ళి టాంటాం చేసేసుకొన్నారు కనుక అదేమీ పెద్ద రహస్యమైన విషయం కాదిప్పుడు. కనుక ఎన్నికల కంటే ముందుగానే బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ పార్టీపై తమకున్న పట్టు నిరూపించుకోక తప్పడంలేదు.
ఇద్దరూ తమ జాబితాలను పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ చేతిలో పెట్టి తమ జాబితానే తప్పనిసరిగా ఆమోదించాలని ఒత్తిడి తెస్తున్నారు. బాబాయ్ జాబితాలో హంతకులు, గూండాలు, జైలుకి వెళ్ళివచ్చిన అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారిని అభ్యర్ధులుగా పెట్టుకొని ఎన్నికలకి వెళితే ప్రజలు మొహం మీద ఉమ్మేస్తారని అబ్బాయ్ వాదన. అటువంటి వారే ప్రజలకి నయాన్నో భయన్నో నచ్చ జెప్పుకొని గ్యారంటీగా గెలవగలరని అవన్నీ గెలుపు గుర్రాలని బాబాయ్ వాదన. ఇద్దరి వాదనలు వాస్తవికత ఉట్టిపడుతోంది. కనుక ప్రస్తుతం పెద్దాయన తీర్పు చెప్పవలసి ఉంది.
బాబాయ్ ఖరారు చేసిన అభ్యర్ధులు జైలుకి వెళ్ళి వస్తేనేమీ...ఒక్కొక్కరిపై డజన్ల కొద్దీ మర్డర్ కేసులుంటేనేమి...అన్నీ గెలుపు గుర్రాలే కనుక తమ్ముడి మాటని కొట్టిపడేయడం కష్టమే. అలాగని కొడుకుని నిరాశపరచలేడు. కనుక 402 టికెట్లను 50:50 చేసి ఇద్దరికీ పంచి పెట్టేస్తారేమో? కానీ అధికార పార్టీ అభ్యర్ధులు మరీ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా ఆ పార్టీ ఎలాగుంటుందో...ఆ ప్రభుత్వం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో..దాని పాలన ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. అన్నట్లు ములాయం వారికి తన జీవితంలో ఒకసారైన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని పాలించుకోవాలని చాలా ముచ్చటపడుతున్నారు.