కోదండరామ్ కి బాల్క సుమన్ హెచ్చరిక

తెలంగాణా రాజకీయ జేయేసి చైర్మన్ ప్రొఫెసర్  కోదండరామ్ తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుంటే,  తెరాస ఎంపి బాల్కా సుమన్ ఆయనను లక్ష్యంగా చేసుకొని ఇంకా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్కా సుమన్ని వారించకపోవడం వలన అవి ఆయన అభిప్రాయలుగానే పరిగణించవలసి ఉంటుంది. ఈరోజు సుమన్ మళ్ళీ చాలా తీవ్రంగా విమర్శించడమే కాకుండా మరొక అడుగు ముందుకు వేసి ప్రొఫెసర్  కోదండరామ్ ని తక్షణమే తీరు మార్చుకోమని లేకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. 

“ప్రొఫెసర్  కోదండరామ్ తెలంగాణా సాధన కోసం చేసిందేమీ లేదు. తెరాస వేసిన టెంటు క్రిండ్ అనిలబడి ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంతే! ఆయన 2014 ఎన్నికల తరువాత నుంచి మెల్లగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం మొదలుపెట్టారు. ఆ తరువాత మా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి జరిగిన ఒక కుట్రలో ఆయనకి కూడా భాగం ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏవిధంగానైనా బ్రతికించేందుకే అయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంటే ప్రాజెక్టుల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రొఫెసర్  కోదండరామ్ మా ప్రభుత్వంపై అనవసరంగా బురద జల్లుతున్నారు. అయన తన తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను,” అని అన్నారు. 

 బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. తెలంగాణా జేయేసి ప్రొఫెసర్  కోదండరామ్ నేతృత్వంలో ఈనెల 29న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ప్రాజెక్టుల కోసం భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లుని వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించబోతున్నారు. విద్యార్ధుల ఫీజు రీ-ఎంబర్స్ మెంటు చెల్లింపులో జాప్యం, ఉద్యోగాల కల్పనలో తెరాస సర్కార్ హామీలను నిలబెట్టుకోనందుకు నిరసనగా ఫిబ్రవరిలో హైదరాబాద్ లో బారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు జరుగుతున్న చోట్ల మార్చి నెలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి వాటిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చాలనుకొంటున్నారు. రాష్ట్రంలో మద్య తరగతి, మరియు చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై చర్చించేందుకు ఒక సదస్సు నిర్వహించబోతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో కాంగ్రెస్, తెదేపా నేతలతో కలిసి నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన పార్టీ ఫిరాయింపులపై కూడా గట్టిగానే మాట్లాడారు. “మనం పోరాడి తెలంగాణా రాష్ట్రం సాధించుకొన్నది విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికే తప్ప వాటిని ఇంకా దిగజార్చడానికి కాదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించడం సరికాదు. ఈ విషయంలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి తన గౌరవం, శాసనసభ గౌరవం నిలబెట్టుకోవాలి,” అని ప్రొఫెసర్  కోదండరామ్ అన్నారు. 

ప్రొఫెసర్  కోదండరామ్ చేస్తున్న ఈ విమర్శలు, ఆయన చర్యలు అన్నీ తెరాస సర్కార్ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచుతాయి. కనుకనే బాల్క సుమన్ ఆయనను అంత తీవ్ర పదజాలంతో హెచ్చరించినట్లు భావించవచ్చు. అయితే తెరాస సర్కార్, ప్రొఫెసర్  కోదండరామ్ ఇద్దరిలో ఎవరి వాదన సరైనది? ఎవరిని నమ్మాలి? అనేది ప్రజలే నిర్ణయించుకొంటే మంచిది.