తెలంగాణా రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన రాజకీయ జేయేసి, రాష్ట్రం ఏర్పడిన తరువాత రద్దవుతుందని చాలా మంది భావించారు. అది సహజం కూడా. కానీ బంగారు తెలంగాణా సాధన కోసం దానిని కొనసాగిస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పినప్పుడు దాని భాగస్వాములలో, ప్రజలలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అదే కారణంతో దానిలో నుంచి చాలా మంది నిష్క్రమించారు కూడా. సుమారు ఒకటిన్నర సంవత్సం పాటు అది స్తబ్దుగా ఉండిపోయినప్పటికీ, తరువాత మళ్ళీ చాలా చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది.
పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలలో వరుస ఓటముల కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వీర్యం అయిపోయినప్పుడు, ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో రాజకీయ జేయేసి వాటికి ప్రత్యామ్న్యాయంగా నిలిచి ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతోంది. అది రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కొనసాగుతున్నందునే దానికి రాష్ట్రంలో మేధావులు, వివిధ సంస్థలు మద్దతు పలుకుతున్నారు. అయితే ఇటీవల జేయేసి కూడా కొన్ని సమస్యలపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు.
దానిని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా జేయేసి నేతలు నిన్న రాజీనామాలు చేశారు. జిల్లా జేయేసి చైర్మన్ కె.శ్రీనివాస్, కన్వీనర్ పి. సదానందం, కో-కన్వీనర్లు దేవదాస్, మారుతి తదితరులు తాము ప్రొఫెసర్ కోదండరామ్ తీరుని వ్యతిరేకిస్తూ జేయేసి నుంచి తప్పుకొంటున్నామని ప్రకటించారు. గతంలో రాష్ట్ర స్థాయి సమావేశాలలో అన్ని జిల్లాల జేయేసి నేతలే ఎక్కువగా పాల్గొనేవారని కానీ ఇప్పుడు జిల్లా స్థాయి జేయేసి నేతలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించవలసిన జేయేసి కార్యక్రమాలలో ఇప్పుడు రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అందుకే తాము రాజీనామా చేసి జేయేసి నుంచి తప్పుకొంటున్నట్లు వారు ప్రకటించారు.
రాజకీయాలకు అతీతంగా జేయేసి పనిచేయలేకపోతోందని ఆరోపిస్తూ వారు తప్పుకొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే లేదా రాజకీయ ఉదేశ్యంతోనే వారు తప్పుకొన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొఫెసర్ కోదండరామ్ అద్వర్యంలో రాజకీయ జేయేసి తెరాస సర్కార్ పై తన పోరాటం ఉదృతం చేస్తున్న ఈ తరుణంలో ఒక జిల్లాకు చెందిన నేతలు అందరూ తప్పుకోవడం జేయేసికి గట్టి దెబ్బేనని చెప్పక తప్పదు.