ఆధార్ ఇక అన్నిటికీ ఆధారం!

నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో ఏర్పడిన నగదు సంక్షోభం మరో సరికొత్త ఆలోచనకు, సంస్కరణకు దారి తీసింది. నగదు కొరత కారణంగానే దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు ఊపందుకొన్నాయి. అయితే నేటికీ కోట్లాది మంది భారతీయులకు ఆ లావాదేవీలు కొరకరాని కొయ్యగానే ఉన్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంది మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకే నగదు రహిత లావాదేవీలు ఏవిధంగా చేయాలో తెలియదు. ఇక నిరక్షరాస్యులు, గ్రామీణులు, రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ప్రజలకెలా తెలుస్తుంది? పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలు, దానిలో సరిపడినంత డబ్బు కలిగి ఉండటం, మొబైల్ ఫోన్లతో లావాదేవీలు జరుపడం సాధ్యమా? అంటే కాదనే అర్ధం అవుతోంది. ఇక క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే దానిపై ఆ సంస్థలు చార్జీలు కూడా వసూలు చేస్తుంటాయి. అందుకే నేటికీ దేశంలో నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతుంటాయి. 

అయితే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవడంతో దాని అమలుకి పోటీలు పడుతున్నాయి. రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకి కరువా అన్నట్లుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి దాని కోసం మొబైల్ యాప్స్ , పోస్ మెషిన్లు, స్వైపింగ్ మెషిన్లు యుద్దప్రాతిపదికన ప్రవేశపెట్టేస్తున్నాయి. తెరాస సర్కార్ త్వరలోనే ‘టీ వాలెట్’ అనే మొబైల్ యాప్ ని ప్రవేశపెట్టబోతుంటే, ఏపి సర్కార్ ‘ఏపి పర్స్’ అనే మొబైల్ యాప్ ని ప్రవేశపెట్టేసింది. 

కేంద్రప్రభుత్వం కూడా “ఆధార్ పేమెంట్ యాప్” అనే ఒక సరికొత్త మొబైల్ యాప్ ని సిద్దం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ దానిని డిశంబర్ 25న ఆవిష్కరించబోతున్నారు. 

వ్యాపారుల వద్ద వేలి ముద్రలను స్కాన్ చేసే సౌకర్యం ఉన్న యాండ్రాయిడ్ ఫోన్లలో ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవలసి ఉంటుంది. వినియోగాదారుడికి ఏదైనా వస్తువులు లేదా సేవలు అందించినప్పుడు, వారి ఆధార్ కార్డ్ నెంబర్, బ్యాంక్ వివరాలు దానిలో ఫీడ్ చేయాలి. తరువాత ఆ ఫోన్లో లేదా దానితో జత చేసిన పరికరం ద్వారా గానీ వారి వేలిముద్ర తీసుకొంటే చాలు చెల్లింపు పూర్తయిపోతుంది. 

కనుక వినియోగదారుల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైల్ ఫోన్స్ లేకపోయినా దీనితో సులువుగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇది చాలా మంచి యాప్ అనే అర్ధం అవుతోంది. అయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలను ఇంకా ప్రోత్సహించాలనుకొంటే చేయడానికి అందుకు వీలుగా ప్రభుత్వ ఖజానాల నుంచి ప్రజల బ్యాంక్ ఖాతాలలోకి సరిపడినంత నగదు జమా అయ్యేందుకు కూడా ఏదైనా యాప్ తయారు చేస్తే బాగుంటుంది. అప్పుడు ప్రజలని బ్రతిమాలుకోనవసరం ఉండదు. అందరూ వద్దనా దానికే మారిపోతారు కదా!!!