త్వరలో రూ.5కే భోజనం క్యాంటిన్లు

తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ. రూ.5కే చాలా నాణ్యమైన టిఫిన్లు అందించి ప్రజల మన్ననలు పొందారు. అది నిరుపేదలకు, రోజువారి కూలీలు చేసుకొనేవారికి, రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొనే వారికి గొప్ప వరంగా మారాయి. అవి ఆమెకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు కలిగించాయి. ఆమె చనిపోయినప్పటికీ ఆ క్యాంటీన్లలో టిఫిన్లు, భోజనం చేస్తున్నవారు ‘అమ్మ’ అంటూ ఆమెను తలుచుకోకుండా ఉండరు. అటువంటి కీర్తి ప్రతిష్టల కోసం కాకపోయినా ఆమే ఆశయం చాలా గొప్పది కనుక ఆమెను ఆదర్శంగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటువంటి క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాయి. ఆంధ్రాలో ఇప్పటికే కొన్ని చోట్ల స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ పేరిట ‘అన్నా క్యాంటీన్ల’ను ఏపి సర్కార్ ఏర్పాటు చేసింది. తెరాస సర్కార్ కూడా త్వరలోనే అటువంటి క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటిఆర్ శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

మొదట ప్రయోగాత్మకంగా హైదరాబాద్ జంట నగరాలలో 52 క్యాంటీన్లని ఏర్పాటు చేసి వాటి ద్వారా రోజూ సుమారు 13,000 మంది నిరుపేదలకి రూ.5లకే భోజనం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు. ఆ తరువాత మరో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేసి రోజుకి కనీసం 50,000 మందికి ఆహారం అందించాలని భావిస్తున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు. వీటికి జి.హెచ్.ఎం.సి. నిధులు అందిస్తుందని, ఇస్కాన్ సంస్థ భోజనం తయారీ, క్యాంటీన్ల నిర్వహణ చేస్తుందని కేటిఆర్ చెప్పారు.