ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయకోణంలో ఆలోచించి తీసుకొంటున్న పలు నిర్ణయాలను వాటి వలన లబ్ది పొండుతున్నవారే కాకుండా ప్రజలు కూడా మనస్పూర్తిగా హర్షిస్తున్నారు. తన అధికారిక నివాసం ప్రగతి భవన్ లో నిన్న ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, టీ ఎన్జీవోల గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ ఇంకా మరి కొంత మంది ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వోద్యోగుల సమస్యలపై వారితో చర్చించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొన్నారు. అవి:
1. ఇకపై రాష్ట్ర, జిల్లా స్థాయి కేడర్లు మాత్రమే ఉంటాయి. జోనల్ వ్యవస్థ ఉండదు.
2. ప్రభుత్వోద్యోగులు డ్యూటీలో ఉండగా మరణించినట్లయితే, వారి పిల్లలో ఒకరికి వయసు, విద్యార్హతలను బట్టి 10 రోజులలోనే ఉద్యోగంలో నియమించాలి. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకే సర్వాధికారాలు ఉంటాయి. ఈ విషయంలో ఏవైనా సడలింపులు అవసరమైతే ఆ అధికారాలు కూడా కలెక్టర్లేకే ఉంటాయి.
3. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే శాఖలో లేదా వేర్వేరు శాఖలలో అయినా వేర్వేరు ప్రాంతాలలో ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నట్లయితే వారిని ఒకే చోట పనిచేసే విధంగా బదిలీ చేయాలి. అన్ని ప్రభుత్వ శాఖలు ఈ నిర్ణయం అమలు చేయడానికి తక్షణమే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
4. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు చివరి రోజునే వారి పించను అందించాలి. సుదీర్గ కాలం వారు ప్రభుత్వానికి సేవలు చేసినందున వారు పదవీ విరమణ చేసిన రోజున వారిని ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి పంపించాలి.
ఇక సచివాలయంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాలను, దాని అధికారులకు కేటాయించిన నివాస భవనాలను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్ లతో కూడిన ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గవర్నర్ నరసింహన్ సహాయ సహకారాలతో వారు ఏపి సర్కార్ తో చర్చించి ఈ సమస్యను పరిష్కరించవలసి ఉంటుంది.