కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకొని చక్కగా మాట్లాడుతున్నారని అందుకు తాను చాలా సంతోషిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అది నిజమేనని నిరూపిస్తూ రాహుల్ గాంధీ వెంటనే స్పందిస్తూ, “మోడీజీ! నన్ను అనుకరిస్తూ అవహేళన చేస్తే చేయండి కానీ మీపై నేను చేసిన అవినీతి ఆరోపణలకి సమాధానం కూడా చెప్పండి,” అని అన్నారు. కానీ మోడీ వాటిపై స్పందించ లేదు. ఆయన తరపున కేంద్రప్రభుత్వంలో చాలా మంది మంత్రులు, భాజపా నేతలు రాహుల్ పై ఎదురుదాడి చేశారు కానీ వారిలో ఎవరూ కూడా రాహుల్ చేసిన ఆరోపణలకి సూటిగా సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్ హయంలో నిత్యం అవినీతి, కుంభకోణాలు జరుగుతుండేవి అదే వేరే విషయం. కానీ మోడీ తను చాలా నిజాయితీపరుడునని చెప్పుకొంటునప్పుడు రాహుల్ చేసిన ఆరోపణలకు సూటిగా సమాధానం చెప్పి ఉండి ఉంటే హుందాగా ఉండేది.
ఈరోజు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నోట్ల రద్దు అనేది ఒక పెద్ద కుంభకోణం, చాలా బారీ ఆర్ధిక దోపిడీ అని అన్నారు. అయితే ఏవిధంగా ఆ కుంభకోణం జరుగుతోందో, ఏవిధంగా ఆర్ధిక దోపిడీ జరుగుతోందో వివరించక పోవడం విశేషం. ఆ మాటకి వస్తే నోట్ల రద్దుని వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలన్నీ అదే పాట పాడాయి కానీ ఏ ఒక్క పార్టీ కూడా తమ వాదనలకు బలం చేకూరే సాక్ష్యాధారాలను సమర్పించలేకపోయాయి.
ఈ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి రాహుల్ గాంధీ పాడుతున్న పాటని ఈరోజు కూడా మళ్ళీ మరో మారు పాడారు. అదే..కోటీశ్వరులు, నల్లధనం ఉన్నవారు ఎవరూ బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూ లైన్లలో నిలబడటం లేదని. వారు వచ్చి నిలబడకపోవడమే వారి వద్ద నల్లధనం ఉందనే దానికి నిదర్శనం అన్నట్లుగా రాహుల్ గాంధీ వాదించారు. అయితే దేశంలో ఎగువ మద్య తరగతి వారు కూడా క్యూ లైన్లలో నిలబడటం లేదు. ఇంకా చెప్పాలంటే రాహుల్, సోనియా గాంధీలతో సహా దేశంలో ఏ ప్రతిపక్ష నేత వచ్చి క్యూ లైన్లలో నిలబడలేదు. క్యూ లైన్లలో నిలబడని వారందరి దగ్గర నల్లధనం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయం అయితే తమ వద్ద కూడా ఉన్నట్లుగానే భావించవలసి ఉంటుంది. అయినా కాంగ్రెస్ పదేళ్ళ పాలనలో దేశానికి మేలు కలిగించే పని ఒక్కటి కూడా చేయలేకపోయినా, ఇప్పుడు మోడీ అటువంటి ప్రయత్నం చేస్తుంటే, అసహనంతో ఉన్న సామాన్య ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.