పోలీస్, హోం గార్డుల పిల్లలకి అపూర్వ అవకాశం

తెలంగాణా రాష్ట్ర పోలీస్ శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకొంది. సైబరాబాద్, రాచకొండ పరిధిలో 900 హోం గార్డు పోస్టులను త్వరలో భర్తీ చేయబోతోంది. దానిలో 20 శాతం 180 పోస్టులను జిల్లాలో పోలీసులు, హోం గార్డుల పిల్లలకు కేటాయించారు. ఈ మేరకు కమీషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఆసక్తి గల అభ్యర్ధులు అంబర్ పేట్ లోని సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ హెడ్ క్వార్టర్లో గల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సోమవారం వరకు మాత్రమే గడువు ఉంది. అక్టోబర్ 30నాటికి, 18ఏళ్ళు నిండి 50 ఏళ్ళ కంటే మించని మహిళా, పురుష అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. 

పోలీస్ శాఖతో పోలిస్తే హోం గార్డుల జీతాలు చాలా తక్కువైనప్పటికీ  ఈరోజుల్లో ఆ ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగానే ఉన్నందున ఇది వారికి మంచి అవకాశంగానే భావించవచ్చు. కానీ వెట్టి చాకిరి చేస్తున్న హోం గార్డుల జీతాలు పెంచి వారికి కూడా పోలీస్ ఉద్యోగులకి వర్తించే అన్ని సౌకర్యాలు కల్పిస్తే వారికీ న్యాయం చేసినట్లు ఉంటుంది. ఇటీవల సింగరేణిలో కార్మికులకి తమ ఉద్యోగాలను వారి కొడుకులు లేదా అల్లుళ్ళకి ఇచ్చుకొనే వెసులుబాటు కల్పించినట్లే పోలీస్ శాఖలో కూడా అటువంటి అవకాశం ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తే బాగుటుంది కదా!