డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేంద్రప్రభుత్వానికి పంపించారు. దానిలో ఎటువంటి కారణాలు తెలుపలేదు. ఆయన గతంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ గా చేశారు. మళ్ళీ విద్యారంగంలోకి వెళ్ళాలనే ఉదేశ్యంతోనే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా 18 నెలలు సమయం ఉంది.
అరబిక్ బాషలో నజీబ్ అంటే ఉన్నతమైన లేదా తెలివైన అని అర్ధం. ఇక జంగ్ అంటే యుద్ధం అని అందరికీ తెలిసిందే. ఆయన తన పేరుకు తగ్గట్లుగా విద్యావేత్తగా మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వారిరువురికీ మద్య నిరంతరంగా యుద్ధం సాగుతూనే ఉంది. వాటి గురించి చెప్పుకొంటే అదో పెద్ద గ్రంధం అవుతుంది. అలుపెరుగని ఆ యుద్దాలతో ఆయన విసుగెత్తిపోయి రాజీనామా చేస్తున్నారో లేక తనలో ఉండే విద్యాతృష్ణ తీర్చుకోనేందుకే రాజీనామా చేశారో మెల్లగా తెలుస్తుంది. కానీ ఆయన రాజీనామా చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ చాలా సంతోషించి ఉండవచ్చు. సుమారు రెండేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో చివరికి లెఫ్టినెంట్ నజీబ్ జంగ్ అస్త్ర సన్యాసం చేసినట్లు అయ్యింది. అందుకు అరవింద్ కేజ్రీవాల్ కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయనకు అంతా మంచే జరుగాలని హుందాగా స్పందించారు. నజీబ్ కూడా ఈ జంగ్ ముగిస్తూ ఇంతకాలం తనకు సహకరించిన డిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి, ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుకొన్నారు.
నజీబ్ జంగ్ స్థానంలో అనిల్ బైజాల్ ని డిల్లీ గవర్నర్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. కనుక అరవింద్ కేజ్రీవాల్ ఇక నుంచి ఆయనతో యుద్ధం ప్రారంభిస్తారేమో?