ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహారా, బిర్లా గ్రూప్ వద్ద నుంచి రూ.40.1 కోట్లు లంచాలు తీసుకొన్నారని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మోడీ ఈరోజు తనదైన శైలిలో స్పందించారు. “కొంతమంది యువ రాజకీయ నాయకులున్నారు. వారిలో ఒక యువనేత కూడా ఉన్నారు. ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకొని మాట్లాడుతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రసంగాలు ఎలాగ చేయాలో నేర్చుకొని మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అయన తన ప్రసంగంతో భూకంపం వస్తుందని అన్నారు. కానీ నిజానికి అయన మాట్లాడక పోతేనే భూకంపం వస్తుంది. అయితే ఆయన మాట్లాడినా కూడా భూకంపం రానందుకు చాలా సంతోషిస్తున్నాను. ఒకప్పుడు సంచీలలో ఎముండేదో ఎవరికీ తెలిసేదే కాదు. కానీ ఇప్పుడు దేనిలో ఏముందో అన్నీ పారదర్శకంగా కనిపిస్తున్నాయి,” అని అన్నారు.
కాంగ్రెస్ హయంలో నిత్యం అవినీతి, కుంభకోణాలు చాల బారీ స్థాయిలో జరిగేవని అందరికీ తెలుసు. అందుకే ఏ సంచీలో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదని అన్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఇప్పటికి రెండున్నరేళ్ళు గడిచిపోయింది. కానీ ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు. అందుకే తన ప్రభుత్వం అవినీతి రహితంగా పారదర్శకంగా పని చేస్తోందని మోడీ గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా తమ హయంలో కుంభకోణాలు జరుగలేదని గట్టిగా చెప్పలేకపోతున్నారు. అయినా మోడీపై అవినీతి ఆరోపణలు చేయడానికి వెనుకాడక పోవడం విచిత్రం.