నిన్నటి వరకు తమిళనాడు ప్రభుత్వంలో అయన కనుసన్నలలో పనిచేసేది కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళబోతున్నారు. ఆయనే తమిళనాడు ప్రభుత్వ ప్రదానకార్యదర్శి రామ్మోహన్ రావు. ఆదాయపన్ను శాఖా అధికారులు నిన్న ఆయన ఇంటిపై దాడులు చేసిన వెంటనే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి, ఆయనను పదవిలో నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఆయనని పదవిలో నుంచి తొలగించి అయన స్థానంలో 1981 బ్యాచ్ కు చెందిన గిరిజా వైద్యనాధన్ ను ఇవ్వాళ్ళ నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయపన్ను శాఖా అధికారులు రామ్మోహన్ రావు ఇంటి నుంచి ఎంత నగదు, బంగారం స్వాధీనం చేసుకొన్నారనే విషయం బయటకు పొక్కనీయకపోవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామంగా చెప్పవచ్చు. ఆయనని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రెవెన్యూ శాఖా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న గిరిజా వైద్యనాధన్ తక్షణమే ప్రభుత్వ ప్రదానకార్యదర్శిగా భాద్యతలు స్వీకరించారు. రామ్మోహన్ రావుకి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయన ప్రత్యర్ధి వర్గానికి చెందిన శశికళ, ఇటీవల పట్టుబడిన శేఖర్ రెడ్డితో బలమైన సంబంధాలు ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శేఖర్ రెడ్డి ద్వారానే రామ్మోహన్ రావు బయటపడ్డారు. కనుక ఇప్పుడు రామ్మోహన రావు ద్వారా ఎవరు పట్టుబడుతారో చూడాలి. కొద్ది సేపటి క్రితం చెన్నైలోని నాగరాజన్ అనే ఐ.ఎ.ఎస్. అధికారి ఇంటిపై ఆదాయపన్ను శాఖా అధికారులు చేసినప్పుడు ఆయన నివాసం నుంచి చాలా బారీగా నగదు, 6కేజీల బంగారం పట్టుబడింది. నగదులో రూ.86 లక్షలు కొత్త నోట్లే.