కేసీఆర్ మరో వాగ్దానం చేస్తున్నారా?

రాష్ట్రంలో మొత్తం 35 లక్షల మంది రైతుల పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వాయిదాలలో మాఫీ చేస్తోంది.  ఇంతవరకు వాటిలో 75శాతం మాఫీ చేసింది. మిగిలిన 25 శాతానికి కూడా 2017 బడ్జెట్ లో నిధులు కేటాయించి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న శాసనసభలో చెప్పారు.

అయితే రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయకుండా వాయిదాల పద్దతిలో చెల్లిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఆ డబ్బు అంతా వడ్డీలకే పోతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈవిధంగా ఎన్నేళ్ళపాటు చెల్లింపులు చేసినా రుణాలు మాఫీ చేయడం కష్టమని వాదిస్తున్నారు. వాటి వాదనలో కొంత నిజముంది కనుక దానిని పూర్తిగా కొట్టి పారేయడం కూడా కష్టమే. 

రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని విధంగా స్పందించారు. ఆ రుణాలనే కాకుండా దానిపై ఇంతవరకు రైతులు చెల్లించిన వడ్డీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా తీర్చివేస్తుందని హామీ ఇచ్చారు. చివరి వాయిదా రుణమాఫీలు చేసిన తరువాత వడ్డీ చెల్లింపుల గురించి తాను బ్యాంకులకి లేఖలు వ్రాస్తానని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన ఈవిధంగా జవాబివ్వడం ద్వారా కాంగ్రెస్ ఆట కట్టించగలిగారు. అయితే కాంగ్రెస్ ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేసినప్పటికీ దాని వలన రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగబోతోంది కనుక అందుకు దానినీ అభినందించవలసిందే. అయితే ఇదే విషయం కాంగ్రెస్ ప్రస్తావించక ముందు కానీ లేదా తరువాత మరెప్పుడైనా గానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి ఉండి ఉంటే ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి దక్కేది కాదు.