
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం హైదరాబాద్ వస్తున్నారు. ప్రతీ ఏటా శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్ కి వచ్చి బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో సుమారు 10 రోజుల పాటు గడుపుతారు. ఆ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. నేటి నుంచి డిశంబర్ నెలాఖరు వరకు రాష్ట్రపతి బొల్లారంలో బస చేస్తారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బొల్లారం చేరుకొంటారు. రాష్ట్రపతి శీతాకాల విడిది సందర్భంగా ఆయన కార్యక్రమ వివరాలు:
డిశంబర్ 23: ఆర్మీ డెంటల్ కాలేజి స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మద్యాహ్నం ఫ్యాప్సీ అద్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు.
డిశంబర్ 24: మహిళా దక్షత సమితి నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
డిశంబర్ 25: బెంగళూరులో భారత-బంగ్లా సాహిత్య సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొంటారు.
డిశంబర్ 27: హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
డిశంబర్ 29: తిరువనంతపురంలో జరిగే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతారు. మైసూరులో జరిగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ సమ్మేళనంలో పాల్గొంటారు.
డిశంబర్ 30: రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖలకి రాష్ట్రపతి నిలయంలో వీడ్కోలు విందు ఏర్పాటు చేస్తారు.
డిశంబర్ 31: మద్యాహ్నం డిల్లీకి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం అవుతారు.
రాష్ట్రపతి హైదరాబాద్ లో బస చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష నేతలు, ప్రజా ప్రతినిధులు ఆయన అపాయింట్ మెంట్ తీసుకొని కలిసే ప్రయత్నం చేస్తుంటారు. ఈసారి కూడా తెదేపా, కాంగ్రెస్, వైకాపా ముఖ్యనేతలు ఆయనని కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. నోట్ల రద్దు కారణంగా చాలా సమస్యలు ఏర్పడ్డాయి కనుక ఈసారి చాల మంది ప్రతిపక్ష నేతలు ఆయనని కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేయవచ్చు.