తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న ఐటి దాడులు

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం తెల్లవారు జామున దాడులు చేశారు. నగరంలోని అన్నానగర్ లోని ఆయన నివాసంతో బాటు నగరంలో ఆయనకు చెందినవిగా భావిస్తున్న 7 చోట్ల అదాయపన్ను శాఖ అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. కొన్ని రోజుల క్రితం నగరంలో శేఖర్ రెడ్డి ఇంటిపై వారు దాడులు జరిపినప్పుడు అతని వద్ద రామ్మోహన్ రావు పేరుతో గల కొన్ని పత్రాలు దొరికాయని సమాచారం. అప్పుడు అదాయపన్ను శాఖ అధికారులు శేఖర్ రెడ్డిని ప్రశ్నించి రామ్మోహన్ రావు గురించి పూర్తి వివరాలు రాబట్టిన తరువాత అతని వద్ద కూడా చాలా బారీగా నల్లధనం ఉన్నట్లు అనుమానించి ఈరోజు తెల్లవారు జామున హటాత్తుగా దాడులు చేశారని తెలుస్తోంది. 

అదాయపన్ను శాఖ అధికారులు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపైనే దాడులు చేస్తారని ఎవరూ ఊహించకపోవడంతో ఈ వార్త చాలా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాట అధికార పార్టీలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్న సమయంలో ఈ దాడులు జరుగుతుండటంతో వాటితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

జయలలిత ఆసుపత్రిలో ఉన్నంత కాలం రామ్మోహన్ రావే శశికళ సూచనల మేరకు ప్రభుత్వాన్ని నడిపించారని వార్తలు వచ్చాయి. ఆమె ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంని కుర్చీలో నుంచి దింపేసి దానిలో తాను కూర్చోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. రామ్మోహన్ రావు ఆమెకు మద్దతుగా తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

శశికళ వర్గం వలన తన కుర్చీకి ఎసరు వచ్చే ప్రమాదం కనిపిస్తుండటంతో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరే సాకుతో పన్నీర్ సెల్వం నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. వెంటనే ఇవ్వాళ్ళ అదాయపన్ను శాఖ అధికారులు రామ్మోహన్ రావు ఇంటిపై దాడులు చేయడంతో ఆయన డిల్లీ పర్యటనకి ఈ దాడులకి కూడా ఏమైనా సంబందం ఉందా? అనే అనుమానం కూడా కలుగుతోంది. 

శేఖర్ రెడ్డి ఇంటిలో దొరికిన వివరాల ప్రకారం రామ్మోహన్ రావు చాలా బారీగా బంగారం పోగు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా అదాయపన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరి కొద్ది సేపటిలో ఆ వివరాలు కూడా బయటకి వస్తాయి. నల్లధనం, బంగారం వెలికి తీయడానికే అదాయపన్ను శాఖ అధికారులు ఈ దాడులు చేస్తున్నప్పటికీ దీని ప్రభావం ఆ రాష్ట్ర రాజకీయాలపై, అధికార పార్టీలో సమీకరణాలపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు.