సింగరేణి కార్మికులకి కేసీఆర్ నూతన సంవత్సర బహుమతి

సింగరేణి కార్మికులకి చిరకాల కోరిక అయిన వారసత్వ ఉద్యోగాలకు వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇది వారికి ఆయన ఇస్తున్న నూతన సంవత్సర బహుమతిగా చెప్పవచ్చు. రెండు దశాబ్దాల క్రితం సింగరేణి ఈ విధానం అమలులో ఉండేది. కానీ అప్పటి ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది.

వాస్తవానికి సింగరేణి బొగ్గు గనులలో ఉద్యోగం చేయడం అంటే ఏసీ రూములలో కూర్చొని సుఖంగా పనిచేసుకొనే ఉద్యోగాలు కావని అందరికీ తెలుసు. నిరంతరం దుమ్ము, దూళి మద్య చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అనేకసార్లు కార్మికులు తాము పని చేస్తున్న గనులలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. కాలుష్యం, పని ఒత్తిడి కారణంగా తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. వారు గనులలో నుంచి బొగ్గును తొలిచి వేస్తుంటే, వారి ఉద్యోగాలు వారి ఆరోగ్యాన్ని తొలిచివేస్తుంటాయి. దశాబ్దాల తరబడి త్రవ్వకాల తరువాత గనులలో బొగ్గు ఖాళీ అయినట్లే, పదవీ విరమణ చేసే సమయానికి వారి శరీరాలు కూడా అనారోగ్యంతో పీల్చి పిప్పి చేయబడతాయి. అటువంటి ప్రమాదకరమైన ఉద్యోగాలను సింగరేణి కార్మికులు తమ వారసులకి ఇచ్చుకొనేందుకు కూడా వీలు లేకుండా గత ప్రభుత్వాలు ఆంక్షలు విదించడం చాలా దుర్మార్గమేనని చెప్పక తప్పదు. అప్పటి నుంచి దాని కోసం సింగరేణి కార్మికులు అడుగుతూనే ఉన్నారు.

దేశం కోసం, రాష్ట్రం కోసం వారు తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న సేవలను, వారు పడుతున్న కష్టాన్ని, వారి కష్టాలను, కన్నీళ్ళను ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధం చేసుకోగలిగారు. అందుకే మళ్ళీ వారసత్వ ఉద్యోగ విధానాన్ని పునరుద్ధరించారు. సింగరేణి కార్మికులు ఈ నూతన సవత్సర బహుమానాన్ని అందుకోవడానికి అన్ని విధాల అర్హులే. 

దీని ప్రకారం 48-59 సం.ల మద్య వయసున్న కార్మికులు ఏ కారణం చేతైన పదవీ విరమణ చేయలనుకొంటే వారు తమ ఉద్యోగాలను తమ కొడుకులు లేదా అల్లుళ్ళకు తమ ఉద్యోగాలు బదిలీ చేసుకోవచ్చు. దీని కోసం జనవరి 1వ తేదీ నుండే కార్మికుల నుంచి అభ్యర్ధన పత్రాలను స్వీకరించడం మొదలుపెడతారు. కార్మికులు తమ దరఖాస్తులను సంబందిత గని లేదా శాఖలో అధికారులకి అందజేయవచ్చు. దీని విదివిధానాల గురించి పూర్తి వివరాలు ఇప్పటికే కార్మికులకి తెలియజేయబడింది. మరిన్ని వివరాల కోసం కొత్తగూడెంలో గల జి.ఎం.(వెల్ఫేర్) అండ్ సి.ఎస్.ఆర్. ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయబోయే సమాచార కేంద్రం నుంచి కార్మికులు తమ సందేహాలను అడిగి తెలుసుకోవచ్చు. 

దీని వలన సుమారు 30,000 మంది కార్మికులు ప్రయోజనం పొందుతారని సింగరేణి యాజమాన్యం అంచనా వేసింది.. నిజం చెప్పాలంటే ఇది గొప్ప వరంగా కనిపిస్తున్నప్పటికీ సింగరేణి కార్మికులు తమ వారసుల ప్రాణాలు, ఆరోగ్యం కూడా పణంగా పెట్టడానికి సిద్దపడుతున్నట్లే చెప్పవచ్చు. కనుక వారు తరతరాలుగా దేశం కోసం అపూర్వమైన త్యాగాలకి సిద్దపడుతున్నట్లే చెప్పవచ్చు.కనుక వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి జై అంటే మనమందరం సింగరేణి కార్మికులకి జై అనాలి.