పవన్ గురి తప్పినట్లున్నాడే?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవ్వాళ్ళ నోట్ల రద్దు అంశంపై తన అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈసారి ఆయన ట్వీటర్ అస్త్రాలు గురి తప్పినట్లున్నాయి. నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్నది ప్రధాని నరేంద్ర మోడీ లేదా ఆయన ప్రభుత్వం అయితే, పవన్ కళ్యాణ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ని నిందించారు. 

ఉర్జిత్ పటేల్ ఫోటో పెట్టి ‘ఈయనే నోట్ల రద్దు అనే నిర్ణయాన్ని తీసుకొన్న ఘనుడు’ అని వ్రాశారు. ఒక పెద్దాయన ఫోటోని పెట్టి, దాని క్రింద “మిష్టర్ ఉర్జీత్ పటేల్, ఈయన ఆంధ్రప్రదేశ్ లో కర్నూలుకి చెందిన బాలరాజు. మీ నోట్ల రద్దు ఆలోచన కారణంగా బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన వారిలో ఈయన కూడా ఒకరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అయ్యింది. నేటికీ దేశంలో అనేకచోట్ల మనుషుల మలమూత్రాలను ఎత్తే పాకీపని వాళ్ళున్నారు. వారు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఏమి చేయాలని ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. కానీ అటువంటి వాళ్ళున్న మన దేశంలో నగదు రహిత లావాదేవీలు జరుపడం సాధ్యమేనని మీరు మమ్మల్ని నమ్మమంటున్నారు. అది సాధ్యమేనా? 

ఉర్జిత్ పటేల్ గారు..మీరు ఎంతో గొప్పదనుకొన్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో కోట్లాదిమంది మీ సహభారతీయుల జీవితాలు చిద్రం చేసింది. వారిలో ఆదివాసీలు, రైతులు, దినసరి కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, వృద్దులు, పళ్ళు, కూరగాయలు అమ్ముకొనే చిరు వ్యాపారులు, నిర్మాణ కార్మికులు, కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు...ఇలాగ ఈ జాబితాలో వ్రాసుకొంటూ పోతే చాలా పెద్దదే ఉంది. దేశంలో అమాయకులు, నిసహ్హాయులు బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకొంటుంటే, అవినీతిపరులు తమ ఇంటి వద్దనే కూర్చొని తమ వద్ద ఉన్న నల్లధనన్ని కొత్త నోట్ల రూపంలోకి మార్చుకొంటూ జాతి సంపదని దోచుకొంటున్నారు.

ఉర్జీత్ పటేల్ గారు, దాదాపు 86శాతం సొమ్ము బ్యాంకులలో జమా అయినందుకు మీరు చాలా సంతోషపడుతుండవచ్చు. దేశంలో నల్లధనాన్ని అంతా పూర్తిగా తుడిచిపెట్టేశామని మీరు గొప్పలు చెప్పుకోవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే మీరు పాత పద్దతులని కొత్త పద్ధతులకి మార్చేరు అంతే. ఈ చర్య తరువాత నల్లధనం పోగేసుకొన్నవారి గ్రూపులో కొత్తగా బ్యాంక్ ఉద్యోగులలో కొంత మంది వచ్చి చేరారు. 

ఉర్జిత్ పటేల్ గారు, ఈవిధంగా  ఎందుకు జరిగిందో మీకు తెలుసా? మీకు తెలిసేందుకు నసీం నికోలస్ తలాబ్ వ్రాసిన పుస్తకం నుంచి ఒక కొటేషన్ చెప్తాను. “నీకు వాస్తవంగా తెలిసినదానికి, నీకు తెలిసి ఉందని నువ్వు అనుకొంటున్న దానికి మద్య తేడా ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడే ఈ స్థాయిలోనే విపత్తులు సంభవిస్తాయి. అనేకమంది ప్రాణాలతో , లక్షలాది మంది జీవితాలతో చెలగాటం ఆడిన మీరు, మీ బాసులు దయచేసి జాగ్రత్తగా నిద్రపోండి. జై హింద్! ఈరోజుకి ఇంతే! నేను నా ఆలోచనలను పూర్తిగా చెప్పలేకపోయాననిపిస్తోంది. కృతజ్ఞతలు,” అని ట్వీట్ చేశారు.