అవిశ్వాస తీర్మానం దేనికి?

రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవక మునుపే ఈసారి ప్రతిపక్షాల వద్ద తమ ప్రభుత్వాన్ని నిలదీయడానికి బలమైన అంశాలు ఏవీ లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఊహించిందే నిజమయినట్లు కనిపిస్తోంది. ఈసారి సమావేశాలలో మొదటిరోజు నుంచే తెరాస ఆధిక్యత కనబరుస్తోంది. సోమవారం శాసనసభలో గ్యాంగ్ స్టార్ నయీంపై కేసుపై జరిగిన చర్చలో అతని కేసులను సిబిఐకి అప్పగించమని కోరడం ద్వారా తెరాస సర్కార్ ని ఇబ్బంది పెదదామనుకొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా క్లాసు పీకారు. 

నయీం సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం అతను జైలు నుంచి తప్పించుకొని పారిపోతే పట్టుకోలేకపోయిందని, అతని వలన అనేకమంది ప్రజలు ధన మాన ప్రాణాలు కోల్పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, కాంగ్రెస్ చేయలేని పనిని తమ ప్రభుత్వం చేసి చూపిస్తే మళ్ళీ తమ ప్రభుత్వంపైనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చాల ఘాటుగా బదులిచ్చారు.  

కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తన అసమర్ధతని కప్పి పుచ్చుకోవడానికేనేమో, స్పీకర్ మధుసూధనాచారిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆలోచిస్తోంది. “శాసనసభలో మాకు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశమే ఇవ్వడం లేదు. ఆయన నిష్పాక్షపాతంగా వ్యవహరించకపోతే మేము అయనపై అవిశ్వాస తీర్మానం పెట్టవలసి వస్తుంది,” అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

అయితే దానితో కాంగ్రెస్ పార్టీ సాధించేది ఏమీ ఉండదు పైగా తన తీర్మానాన్ని ఆమోదింపజేసుకోనేంత బలం లేని కారణంగా అది వీగిపోతుంది. కనుక ఏదో పేరుకి తీర్మానం పెట్టామని చెప్పుకోవడానికి తప్ప దాని వలన స్పీకర్ కి ఏమీ నష్టం ఉండదు. అయితే తాము శాసనసభలో తెరాస సర్కార్ ని గట్టిగా నిలదీస్తున్నామని కాంగ్రెస్ నేతలు డిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలకి చెప్పుకోవడానికి పనికి వస్తుందని చెప్పవచ్చు.