ఆ ఐదుగురికీ ఉరి శిక్షే!

ఈరోజు ఎన్.ఐ.ఎ.కోర్టు సంచలన తీర్పు చెప్పింది. దిల్ సుక్ నగర్ జంట బాంబు ప్రేలుళ్ళ కేసులో దోషులుగా గుర్తించిన ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురికీ ఎన్.ఐ.ఎ.కోర్టు ఉరి శిక్ష విదిస్తూ ఈ రోజు తీర్పు చెప్పింది. మూడేళ్ళ క్రితం అంటే 2013, ఫిబ్రవరి 21 సాయంత్రం దిల్ సుక్ నగర్ లో బాగా రద్దీగా ఉండే సమయంలో జరిగిన జంట బాంబు ప్రేలుళ్ళలో 19 మంది మరణించగా 136 మందికి పైగా గాయపడ్డారు. 

ఆ కేసుని గత మూడేళ్ళుగా దర్యాప్తు చేసిన ఎన్.ఐ.ఎ. 157 మంది సాక్షుల వాంగ్మూలం, ఇతర ఆధారాలను సేకరించి రియాజ్ భత్కల్ (ఎ-1), యాసిన్ భత్కల్ (ఎ-2), అసదుల్లా అక్తర్ (ఎ-3), తెహసీన్ అక్తర్ (ఎ-4), జియా ఉర్ రహమాన్ అలియాస్ వకాస్ (ఎ-5), ఐజాజ్ షేక్ (ఎ-6)లు నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్స్ దాఖలు చేసింది. వారందరూ చాలా హేయమైన నేరానికి పాల్పడినందున ఎన్.ఐ.ఎ.కోర్టు వారందరికీ ఉరి శిక్ష విధించడమే సబబని భావిస్తున్నామని ఎన్.ఐ.ఎ.కోర్టు తీర్పు చెప్పింది. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అయిన రియాజ్ భత్కల్ పరారిలో ఉన్నాడు. అతను ప్రస్తుతం పాకిస్తాన్ లో కరాచీలో ఉన్నట్లు సమాచారం. కనుక అతను ఒక్కడే ఈ మరణ శిక్షను తప్పించుకోగలుగుతాడు.   

 ఎన్.ఐ.ఎ.కోర్టు తీర్పు కాపీని హైకోర్టుకి పంపించింది. హైకోర్టు కూడా దానిని ఆమోదించినట్లయితే దోషులకు ఉరి శిక్ష అమలు చేస్తారు. కానీ వారు హైకోర్టులో దాని తరువాత సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకొనే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా వారికి మరణ శిక్ష ఖరారు చేసినా వారు రాష్ట్రపతికి క్షమాభిక్షకి దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రక్రియ అంతా పూర్తయి వారికి శిక్ష అమలుకావడానికి కనీసం మరొక ఏడాదిపైనే పట్టవచ్చు.