అసెంబ్లీలో నయీం!

కొన్ని నెలల క్రితం ఎన్కౌంటర్ లో హతమైన నయీం కేసు గురించి ఈరోజు శాసనసభ సమావేశాలలో చర్చ జరిగింది. అతని కేసుల పురోగతి, అతని ఆస్తులు వగైరా వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులకు తెలియజేశారు.

“నయీం చచ్చినందుకు రాష్ట్ర ప్రజలు అందరూ చాలా సంతోషించారు. ముఖ్యంగా భువనగిరి ప్రజలు పండుగ చేసుకొన్నారు. అతనిపై ఇప్పటి వరకు మొత్తం 174 కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులతో సంబంధం ఉన్న 741 మందిని విచారించి, 124 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాటిలో నయీం స్వయంగా 27 కేసులలో, అతని అనుచరులు మరో 25 కేసుల్లో హత్య నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో కనుగొన్నారు. వాటిలో ఇంతవరకు రెండు చార్జ్ షీట్లు దాఖలు చేయగా త్వరలోనే మరో 15 ఛార్జ్ షీట్లు దాఖలు చేయబోతున్నారు. నయీం స్థావరాల నుంచి 21 కార్లు, 26 బైకులు, రూ.2.95కొత్లుఇ నగదుని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నయీం, అతని సమీప బంధువుల పేరిట 1015 ఎకరాల భూమి, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నయీం కూడబెట్టిన అన్ని ఆస్తుల విలువ కలిపి మొత్తం రూ.143 కోట్లు ఉంటుంది. నయీం కేసుని రాష్ట్ర సి.ఐ.డి. పోలీసులు చాలా సమర్ధంగానే దర్యాప్తు చేస్తున్నారు. కనుక నయీం కేసులను సిబిఐకి అప్పగించదలచుకోలేదు. నయీంతో సంబందం ఉన్నవారు ఎంత పెద్దవారైన వదిలిపెట్టేది లేదు,” అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.