సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపి, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఖర్చుకి, పనులకి కేటాయిస్తున్న డబ్బుకి ఎక్కడా పొంతనలేదు. అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చేసి వాటిని అమలుచేయలేకపోతున్నారు. కానీ ఆయన మాటలు చెప్పడంలో చాలా గొప్ప మొనగాడు. ఆ మాటలతోనే కాలక్షేపం చేసేస్తున్నాడు. నేటి రాజకీయాలలో అటువంటి మొనగాళ్ళే ఎక్కువయిపోయారు. అయన పాలన పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మాపార్టీయే తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కారణంగానే మా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుతున్నాయి. ఆయన కూడా చంద్రబాబు నాయుడులాగే ఒక ఏడాది ముందు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారేమో? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే ఎన్నికలకి వెళ్ళినట్లయితే మళ్ళీ తెరాసయే అధికారంలోకి వస్తుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. ఆ విధంగా చేసినట్లయితే మాకు మహోపకారం చేసినట్లవుతుంది. ఆయన వలెనే మేము ఒక ఏడాది ముందుగా రాష్ట్రంలో అధికారంలోకి రాగలుగుతాము,” అని అన్నారు.
ఆయనకి దేశంలో నెంబర్: 1 ముఖ్యమంత్రి ర్యాంక్ రావడంపై జైపాల్ రెడ్డి స్పందిస్తూ “డిల్లీలో అనేక సంస్థలున్నాయి. అవిచ్చిన ర్యాంకులను చూసి మురిసిపోవడం కాదు. రాష్ట్రంలో ప్రజలు ఆయనకి నెంబర్: 1 ర్యాంక్ ఇస్తే సంతోషిస్తాము. ఆయన మరో 20 ఏళ్ళు కాదు..120 వయసు వరకు పూర్తి ఆయురారోగ్యాలతో ఉనాడాలని కోరుకొంటున్నాను. కానీ ఆయన పాలన ఎంత త్వరగా ముగిసిపోతే అంతమంచిదని అందరూ కోరుకొంటున్నారు. ఆయన ఈ రెండున్నరేళ్ళలో రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పమనండి? ఏమీ చేయలేకపోవడం వలననే మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు,” అని జైపాల్ రెడ్డి అన్నారు.