హైదరాబాద్ లో ఒక బ్యాంక్ మేనేజరుపై నిన్న ఆయన నివాసంలోనే కాల్పులు జరిగాయి. కృష్ణ భీమా సమృద్ధి అనే ఒక ప్రైవేట్ బ్యాంక్ సి.ఈ.ఓ.గా వ్యవహరిస్తున్న ఓడిశాకు చెందిన మన్మద్ దలాయ్ (62) మాసాబ్ ట్యాంక్ సమీపంలో శాంతి నగర్ లో శ్రీ దుర్గా కనుమల్లి అనే అపార్టుమెంటులో తన భార్యతో కలిసి ఉంటున్నారు. ఒక గుర్తు తెలియని వ్యక్తి నిన్న ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారిద్దరి మద్య వాగ్వాదం జరిగింది. తరువాత ఆ వ్యక్తి దలాయ్ పై ఒక దేశవాళి తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. కానీ అదృష్టవశాత్తు ఆయనకేమి కాలేదు. బులెట్ కాలులో దిగడంతో ఆయనని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన ఇదివరకు ఎప్పుడో నోట్ల రద్దుకు ముందు జరిగి ఉన్నట్లయితే అది సాధారణ వార్తగానే భావించవచ్చు కానీ ఇప్పుడు బ్యాంక్ అధికారులు నల్లకుభేరులతో కుమ్మకై లక్షలు, కోట్ల రూపాయలు నల్లదనానికి సరిసమానమైన కొత్తనోట్లు ఇచ్చేస్తునందున ఈ కాల్పుల ఘటన కూడా ఆ కోణంలో నుంచే చూడవలసి ఉంటుంది. ఈ నోట్లమార్పిడి వ్యవహారాలన్నీ చాలా పెద్ద స్థాయిలో ఉన్న అధికారుల అందండలు ఉంటే తప్ప జరిగే పనులు కావు కనుక, ఒకవేళ ఆ వ్యవహారంలో ఏమైనా మన్మద్ దలాయ్ కి కాల్పులు జరిపిన వ్యక్తికి ఏమైనా తేడా రావడం వలన ఈ సంఘటన జరిగిందా? అనే విషయం తెలియవలసి ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తికి మన్మద్ దలాయ్ మద్య వాగ్వాదం జరిగిన తరువాతనే ఈ కాల్పులు జరుగడం ఈ అనుమానం కలిగిస్తోంది. ఏమైనప్పటికీ మన్మద్ దలాయ్ క్షేమంగానే ఉన్నారు కనుక అతని ద్వారానే విషయం బయటపడుతుంది. ఒకవేళ అదే అయితే ఆ వ్యవహారాలలో జరిగిన మొదటి హత్యా ప్రయత్నం కూడా ఇదేనని చెప్పక తప్పదు.