పాక్ ఉగ్రవాదులు భారత ఆర్మీని లక్ష్యంగా చేసుకొని రకరకాల పద్దతులలో తరచూ దాడులు చేస్తూ మన సైనికులను బలి తీసుకొంటున్నారు. ఒకసారి నేరుగా ఆర్మీ క్యాంపులపై విరుచుకు పడుతూ, మరొకసారి దారిలో మాటువేసి ఆర్మీ వాహనాలపై దాడులు చేస్తూ, జనావాసాల మద్య సైనికులున్నప్పుడు గెరిల్లా పద్దతిలో దాడులు చేస్తూ సైనికుల ప్రాణాలు బలిగొంటున్నారు.
ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా జిల్లాలో ప్యాంపోర్ సెక్టార్ లో మోటార్ సైకిళ్ళపై వచ్చి ఆర్మీ వాహనాలలో ఉన్న జవాన్లపై కాల్పులు జరిపి పారిపోయారు. వారి వాహనాలు జనావాసాల మద్య నుంచి సాగుతున్న సమయంలో దాడులు చేయడంతో జవాన్లు తిరిగి ఎదురుదాడి చేయలేకపోయారు. అదే అదునుగా వారు తప్పించుకొని పారిపోయారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.
ఈ దాడి జరిగిన వెంటనే భద్రతాదళాలు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు మోటార్ సైకిళ్ళపై వచ్చి దాడి చేసి తప్పించుకొని పారిపోగాలిగారంటే వారికి స్థానికంగా వేర్పాటువాదుల సహకారం అంది ఉండవచ్చు. ఉగ్రవాదులు ఈవిధంగా మెరుపు దాడులు చేసి జవాన్లని బలిగొనడం నిత్యకృత్యంగా మారిపోయింది. ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్తకొత్త వ్యూహాలతో దాడులు చేస్తుండటం వలన వారి నుంచి తప్పించుకొని ఎదురుదాడి చేయడం జవాన్లకి కూడా చాల కష్టంగా మారింది. దీనికి మన సైనిక యుద్ద నిపుణులు ప్రత్యేక ప్రతివ్యూహం సిద్దం చేసుకోనంతవరకు నిత్యం ఒకరిద్దరు జవాన్లని కోల్పోక తప్పదేమో?