కాకులను కొట్టి గద్దలకి పెట్టినట్లు...

ఈ 38 రోజులలోనే దేశవ్యాప్తంగా జరిపిన దాడులలో రూ.2900 కోట్లు నల్లధనం, వందల కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు పట్టుబడ్డాయని ఆదాయ పన్ను శాఖ చెపుతోంది. బహుశః మిగిలిన ఈ 13 రోజులలో మరో అంత నల్లధనం పట్టుబడిన ఆశ్చర్యం లేదు. అంటే కేంద్రప్రభుత్వం ఎన్ని కటిన చర్యలు తీసుకొంటున్నా నల్లకుభేరులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టం అవుతూనే ఉంది.

నిజానికి ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టుకోగలిగింది సముద్రంలో నీటి బొట్టు అంత మాత్రమేనని చెప్పవచ్చు. సిబ్బంది కొరత వలన లేదా రాజకీయ కారణాల వలన లేదా వేరే కారణాల చేత వారు మన దేశంలో వేలు, లక్షలు కోట్లు టర్నోవర్ కలిగి ఉన్న కార్పోరేట్ సంస్థల జోలికే వెళ్ళడం లేదు. వెళ్ళి ఉండి ఉంటే, దేశంలో పేదరికం, దారిద్ర్యం అంతా ఒక్కసారే తీరిపోయేoత నల్లధనం బయపడి ఉండేది. కానీ బ్యాంకులకి లక్షల కోట్లు ఎగవేస్తున్న అటువంటివారి రుణాలు మాఫీ చేస్తూ, కేంద్రప్రభుత్వం సామాన్యులపై తన ప్రతాపం చూపించదానికి సిద్దం అవుతుండటం చాలా విచారకరమే. 

ఇంతవరకు పెద్దగా లావాదేవీలు జరుగని ఖాతాలలో రెండు లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా జమా అయిన వారి ఖాతాల వివరాలని సేకరించి వారికి నోటీసులు పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దు తరువాత నల్లకుభేరులు తమ వద్ద పోగుపడిన నల్లధనాన్ని నిరుపేదల జనధన్ ఖాతాలలో, సామాన్య, మద్యతరగతి ప్రజల ఖాతాలలో వేసుకొని వారికి కొంత కమీషన్ ముట్టజెప్పి వైట్ గా మార్చుకొనే ప్రయత్నం చేయడం, ఆయాచితంగా వస్తున్న ఆ డబ్బుకి ఆశపడి చాలా మంది తమ ఖాతాలలో ఆ నల్లధనం వేసుకొన్న మాట వాస్తవం. కనుక ఒకవేళ ప్రభుత్వం శిక్షించదలిస్తే ప్రజల బలహీనతని ఆసరాగా చేసుకొని నల్లధనం మార్చుకొన్న నల్లకుభేరులని కనుగొని శిక్షించాలి కానీ సామాన్య ప్రజలని కాదు. 

ఈ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించేటప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సామాన్య ప్రజలు తమ ఖాతాలలో రెండున్నర లక్షల వరకు వేసుకోవచ్చని వారిని దానిపై ఎటువంటి ప్రశ్నలు అడుగబోమని చెప్పారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు, మధ్యతరగతి ప్రజలు ఆ మాత్రం డబ్బు దాచుకొనే శక్తి కలిగి ఉంటారు గనుకనే అంత పరిమితి నిర్ణయించామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ఖాతాలని పరిశీలిస్తామని చెప్పడం సరికాదు.

ఒకవేళ అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే అది ప్రజలని భయాందోళనలకి గురిచేస్తుంది. అయినా వందలు, వేలు కోట్ల విలువగల కొత్త నోట్లని బ్యాంకుల నుంచి దర్జాగా తరలించుకొనిపోతున్నవారిని పట్టుకొనే ప్రయత్నాలు చేయవలసింది పోయి సామాన్య ప్రజలపై కేంద్రప్రభుత్వం తన ప్రతాపం చూపాలనుకోవడం సరికాదు.