ఒక పెద్ద హీరో నటించిన బారీ బడ్జెట్ సినిమా విడుదలవుతుంటే అభిమానులలో ఎంత గొప్ప అంచనాలు ఉంటాయో అంతకంటే చాలా ఎక్కువ అంచనాల మద్య దేశ రాజకీయాలలోకి ఒక ఉప్పెనలాగ దూసుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పక తప్పదు. కానీ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దేశ రాజకీయాలలో ఒక గొప్ప జోకర్ గా మారిపోయారు. ఆ విషయంలో అయన కంటే సీనియర్, గట్టి పోటీ ఇస్తున్న మరో వ్యక్తి రాహుల్ గాంధీ. వారిద్దరూ ఏనాడూ చేతులు కలుపనప్పటికీ, దేశ రాజకీయాలలో కామెడీ ట్రాక్ అద్భుతంగా పోషిస్తుంటారు. పఠాన్ కోట్, యూరీ దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్, కాశ్మీర్ లో అల్లర్లు, నోట్ల రద్దు...ఎంత సీరియస్ అంశంపై చర్చలు జరుగుతున్నా, ఎంత గంభీరమైన వాతావరణం ఏర్పడి ఉన్నా వారిద్దరూ ఎంట్రీ ఇచ్చారంటే జనాలు కడుపుబ్బ నవ్వుకోవలసిందే. ఒకవేళ ఎవరిదైనా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అక్కడికి బ్రహ్మానందం వస్తే ఏమవుతుందో వారు అంతే. వారిద్దరూ చేసే కామెడీని చూసి జనాలు హాయిగా నవ్వుకోకుండా ఉండలేరు.
“నోట్ల రద్దు ఒక పెద్ద కుంభకోణం..దానిలో ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారు. అందుకు నా వద్ద బలమైన ఆధారాలున్నాయి..నేను నోరు విప్పితే భూకంపం వచ్చేస్తుంది..అందుకే నన్ను లోక్ సభ లో మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నారు...” అని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ, నిన్న సాయంత్రం పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత ప్రతిపక్ష ఎంపిలతో కలిసి పాదయాత్ర చేసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతిపత్రం ఈయవలసి ఉంది.
కానీ అంతకంటే ముందు, వారెవరికీ చెప్పకుండా గులాం నబీ ఆజాద్ వంటి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చి ప్రతిపక్షాలకి షాక్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ అవకాశం చక్కగా ఉపయోగించుకొని రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో తీయించుకొని దానిని మీడియాకి అందజేయడంతో రాహుల్ గాంధీ కంగు తిన్నారు. రాహుల్ గాంధీ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం చెందిన ప్రతిపక్షాలలో కొందరు నేతలు పాదయత్ర నుంచి తప్పుకొని వెళ్ళి పోయారు.
తను యూపిలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పి వారి సమస్యలని పరిష్కరించమని అడగడానికే వెళ్ళి కలిశానని రాహుల్ గాంధీ ఎంత మొత్తుకొన్నా ఎవరూ నమ్మలేదు. అదో కామెడీ సీన్...ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయవచ్చు.
రాహుల్ గాంధీ తనని డామినేట్ చేస్తున్నట్లు అనుమానం కలిగిందో ఏమో వెంటనే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎంటర్ అయిపోయారు. “రాహుల్ జీ... మోడీ అవినీతి గురించి మీ వద్ద ఉన్నా ఆ ఆధారం ఇంకా ఎప్పుడు బయటపెడతారు? భూకంపం రాలేదు..ఎప్పుడువస్తుంది?” అంటూ చురకలు వేశారు.