ఆ విషయంలో బాబు కంటే కేసీఆరే నయం?

నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తరువాత ఏపి సిఎం చంద్రబాబు నాయుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా దానిని స్వాగతించగా, తెలంగాణా సిఎం కేసీఆర్ దానిని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఓ పది రోజుల వరకు ఆయన దానిపై స్పందించ లేదు. పైగా దాని వలన రాష్ట్రానికి నెలకి రూ. 2,000 కోట్లు వరకు ఆదాయం కోల్పోతోందని మంత్రుల ద్వారా చెప్పించడం ద్వారా ఆయన నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం ప్రజలలో కలిగించారు. అదే సమయంలో ఏపి సిఎం చంద్రబాబు తానే ప్రధాని నరేంద్ర మోడీకి ఆ సలహా ఇచ్చానని చెప్పుకొంటూ ఆ క్రెడిట్ స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. నోట్ల రద్దుపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఈవిధంగా పూర్తి భిన్నంగా వ్యవహరించారు. 

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దాని వలన సమస్యలు ఏర్పడినప్పుడు మళ్ళీ ఇద్దరూ తమ వైఖరికి భిన్నంగా మాట్లాడటం మొదలుపెట్టారు. మొదట నోట్ల రద్దుని వ్యతిరేకించిన కేసీఆర్ దానిని సమర్ధిస్తూ మాట్లాడటం మొదలుపెట్టగా, ప్రధానికి ఆ సలహా తానే ఇచ్చానని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు ‘నోట్ల రద్దు చేసే ముందు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉంటే బాగుండేది..తనవంటి మేధావులని సలహాలు, సూచనలు తీసుకొని ఉండి ఉంటే బాగుండేది..నోట్ల కొరత సమస్యని కేంద్రప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి..’అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. 

మళ్ళీ తేరుకొని తెరాస సర్కార్ కంటే ముందుగా ‘ఏపి పర్స్’ మొబైల్ యాప్ ప్రవేశపెట్టేసి నగదు రహిత లావాదేవీలని అందరూ అలవాటు చేసుకోవలంటూ హితబోధ ప్రారంభించారు. దానికోసం చాలా గట్టి కసరత్తు మొదలుపెట్టేశారు కూడా. కానీ నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడలేదు. నిజానికి భాజపా నేతలు కూడా దాని గురించి గట్టిగా సమర్దించుకొంటూ మాట్లాడలేదనే చెప్పాలి. కానీ తెదేపా, భాజపాల కంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా చాలా గట్టిగా మాట్లాడటం విశేషం. 

ఈరోజు శాసనసభలో ఈ అంశంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడీ చాలా సాహసోపేతమైన, దేశానికి మేలు కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకొన్నారు. దాని లోటు పాట్లని పక్కన బెట్టి, దాని వలన మన దేశానికి కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మనమందరం ప్రధాని నరేంద్ర మోడీకి మన శక్తి మేర మన పరిధిలో సహకరించాలి. అసలు ఈ నిర్ణయం చాలా దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీయే తీసుకోవాలనుకొంది కానీ దాని వల్ల కాలేదు. కానీ మోడీ ధైర్యంగా దానిని అమలుచేశారు. దాని వలన తాత్కాలికంగా మనం కొన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తున్నా దాని విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరం సహకరిద్దాం. నల్లధనం వెలికితీయడం కోసం ఆయన చేసే ఎటువంటి ప్రయత్నానికైనా మనందరం సహకరించాలి. అప్పుడే మన దేశం ప్రపంచ దేశాలలో నెంబర్: 1 స్థానంలో నిలుస్తుంది. శాసించగలుగుతుంది,” అని కేసీఆర్ అన్నారు. 

నగదు రహిత లావాదేవీల గురించి మాట్లాడుతూ, “క్యాష్ లెస్ ఎకానమీ అంటే 100 శాతం నగదు రహితమని కాదు అర్ధం. అమెరికా వంటి దేశాలలో కూడా 72 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతుంటే, మిగిలినది నగదుతోనే జరుగుతున్నాయి. కనుక మనం క్యాష్ లెస్ అనగానే భయపడిపోనవసరం లేదు. మన దేశంలో 100 శాతం నగదు రహిత లావాదేవీలు ఎన్నటికీ సాధ్యం కావు. అయితే దేనినీ గుడ్డిగా నమ్మకూడదు గుడ్డిగా వ్యతిరేకించకూడదు. మన రాష్ట్రానికి, దేశానికి ఏది మంచో తెలుసుకొని దానిని ఆచరించడంలో కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా వెనుకాడకూడదు.”

“ఆ దిశలో మనమందరం అడుగులు వేయవలసి ఉంది. అందుకే త్వరలో టీ-వాలెట్ ని ప్రవేశపెట్టబోతున్నాము. మన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలని బలిపెట్టాలనుకోకూడదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు అదే చేస్తున్నాయి. కనుక మనం దేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి సహాయసహకారాలు అందిద్దాం. స్బహలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తూనే రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహిద్దాం,” అని కేసీఆర్ అన్నారు. 

ఇంత బలంగా చంద్రబాబు నాయుడు, భాజపా నేతలు కూడా ప్రధాని నరేంద్ర మోడీని సంర్దిన్చాలేదంటే అతిశయోక్తి కాదు.