తెదేపా ఎమ్మెల్యేలు కూడా అవుట్

శాసనసభ నుంచి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన తరువాత పార్టీ ఫిరాయింపులపై సభలో చర్చ జరపాలని పట్టుబడుతూ ఆందోళన చేస్తున్న ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలని కూడా సభా కార్యక్రమాలకు అడ్డు పడుతున్నందుకు సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేయవలసిందిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదించగా, శాసనసభ సభ్యుల ఆమోదంతో వారిరువురిని కూడా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూధనాచారి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్లుగా కొని చేర్చుకొన్నారని, వారిపై తక్షణం చర్యలు చేపట్టామని అడుగుతున్నందుకు తమని సస్పెండ్ చేసి బయటకి పంపించేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ కూడా అధికార పార్టీ తరపున పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు తప్ప నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. మార్షల్స్ కూడా తెరాస కార్యకర్తల్లాగా చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన జేబులో నుంచి జీతం ఇవ్వడం లేదని, ప్రభుత్వమే వారికి జీతాలు ఇస్తోందని గ్రహించి శాసనసభ్యులమైన తమ పట్ల మర్యాదగా వ్యవహరించడం నేర్చుకోవాలని రేవంత్ రెడ్డి మార్షల్స్ ని హెచ్చరించారు. 

అయితే రేవంత్ రెడ్డి చేసిన ‘సంతలో పశువుల కొనడం’ ఏపిలో తమ తెదేపా ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని మరిచిపోయినట్లున్నారు. ఏపిలో తెదేపా ప్రభుత్వం 20 మంది వైకాపా ఎమ్మెల్యేలని కొనుక్కొంది.    

కాంగ్రెస్, తెదేపా సభ్యుల సస్పెన్షన్ తరువాత ఇక భాజపా, మజ్లీస్ పార్టీల సభలో ఉన్నారు. తెదేపా సభ్యులని సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తప్పు పట్టారు. తన పరిశీలనలో ఉన్న ఆ అంశంపై తాను స్పందించేవరకు వారందరూ వేచి చూసి ఉండి ఉంటే వారికి ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదని స్పీకర్ మధుసూదనాచారి సమాధానం చెప్పడం విశేషం. పార్టీ ఫిరాయిన్చినవారిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్షాలు ఆయనకీ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. చివరికి హైకోర్టు, సుప్రీంకోర్టు హెచ్చరించినా ఆయన స్పందించలేదు. మరి ఇంకా ఎప్పుడు స్పందిస్తారో ఆయనకే తెలియాలి. అందుకే శాసనసభలో ప్రతిపక్షాలు దానిపై చర్చకు పట్టుబట్టాయని చెప్పవచ్చు.