ఈరోజు రాష్ట్ర శాసనసభ రెండవరోజు సమావేశంకాగానే కాంగ్రెస్ సభ్యులు పార్టీ ఫిరాయింపులపై సభలో చర్చ జరపాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కానీ ప్రశ్నోత్తరాల సమయం తరువాత దానిపై చర్చిద్దామని స్పీకర్ మధుసూదనాచారి చెపుతున్న వినకుండా తక్షణమే వాయిదా తీర్మానంపై చర్చ జరుపాలని పట్టుబడుతూ కాంగ్రెస్ సభ్యులు సభని స్తంభింపజేశారు. స్పీకర్ ఎంతగా నచ్చ జెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకుండా సభా కార్యక్రమాలకి అడ్డు పడుతుండటంతో స్పీకర్ 9 మంది కాంగ్రెస్ సభ్యులని ఒకరోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారు: భట్టి విక్రమార్క, డి.కె.అరుణ, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతిరెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, రామ్మోహన్ రెడ్డి.
అనంతరం కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులని సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తాను కూడా నిరసనగా సభ నుంచి వాక్ అవుట్ చేస్తానని చెప్పారు.