ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్న టాటా గ్రూప్ సంస్థలు ఈ మధ్యకాలంలో తరచూ వార్తలలో కనిపిస్తున్నాయి. ఆ వార్తలన్నీ కూడా ఆ సంస్థ దశాబ్దల తరబడి కష్టపడి సంపాదించుకొన్న పేరు ప్రతిష్టలకి చాలా భంగం కలిగించేవిగా ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం. టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ పదవి నుంచి పల్లోంజీ సైరస్ మిస్త్రీని చాలా హటాత్తుగా, చాలా అవమానకరంగా తొలగించడంతో మొదలైన గొడవల వలన టాటా సంస్థల పేరుప్రతిష్టలు చాలా దెబ్బ తింటున్నాయి.
ఇప్పుడు టాటాలకి ఇంకా పెద్ద షాక్ తగిలింది. టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి శుక్రవారం ప్రత్యేకకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆయనకి 2జి స్పెక్ట్రం కుంభకోణంలో పాత్ర ఉందని కనుక ఆయనని విచారించవలసిందిగా కోరుతూ పిటిషన్ వేశారు. రతన్ టాటాతో బాటు మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, కార్పోరేట్ లాబీయిస్ట్ మీరా రాడియా తదితరుల పేర్లని కూడా ఆయన తన పిటిషన్ లో చేర్చారు. ఆ కేసు వచ్చే నెల 11న విచారణ జరుపబోతున్నారని తాజా సమాచారం.
సుబ్రహ్మణ్య స్వామి ఒకసారి పిటిషన్ వేసి ఎవరి వెంటయినా పడ్డారంటే ఇక వారికి శని పట్టినట్లే భావించవచ్చు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై అక్రమాస్తుల కేసు పెట్టినప్పుడు సుమారు రెండు దశాబ్దాల పాటు అది సాగి ఆమెకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరికి దాని వలన ఆమె తన పదవికి రాజీనామా చేసి జైలుకి వెళ్ళవలసి వచ్చింది.
ఈ ఏడాదిలో సుబ్రహ్మణ్య స్వామి డిల్లీకి మకాం మార్చిన తరువాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ వెంటపడితే ఆయన దణ్ణం పెట్టి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టాటాల వెంట పడ్డారు కనుక ఇక వారికి శని దాపురించినట్లే భావించవచ్చు.అసలు మీడియాలో ఈ వార్త రావడంతోనే అది మొదలైనట్లు చెప్పవచ్చు. ఈ వార్తతోనే టాటా షేర్లు నష్టపోయే అవకాశం ఉంది.