వెంటిలేటర్ పై కరుణానిధి

తమిళనాట రాజకీయాలలో తీవ్ర ఒడిడుకులు ఏర్పడుతున్నాయి. జయలలిత మృతి తరువాత ఆ పార్టీలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు అధికార పంపకాలపై చాలా సులువుగా రాజీపడినప్పటికీ, చాల మంది జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకి జరిగిన చికిత్సపై తమకి అనుమానాలు ఉన్నాయని, కనుక దానిపై విచారణ జరిపించాలని కోరుతూ డిఎంకె పార్టీ నేత స్టాలిన్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఆయన తండ్రి డిఎంకె పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మళ్ళీ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఇదివరకు ఆయనకీ చికిత్స అందించిన కావేరీ ఆసుపత్రికే తరలించారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెపుతున్నారు. కానీ రాష్ట్రం నలుమూలల నుంచి డిఎంకె కార్యకర్తలు ఆసుపత్రికి తరలివస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ ఇద్దరూ ఆయన వద్దే ఉన్నారు. ఆయన ఈ మద్యనే తన రెండవ కుమారుడు స్టాలిన్ తన రాజకీయ వారసుడుగా ప్రకటించారు. డిశంబర్ 20న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించబోతున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. ఒకవేళ కరుణానిధికి ఏమయినా అయితే స్టాలిన్ డిఎంకె పార్టీ పగ్గాలు చేబట్టడం ఖాయమనే చెప్పవచ్చు. తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకె, అన్నాడిఎంకె పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది. ఇప్పుడు ఇంచుమించు ఒకేసారి వారసులు ఆ రెండు పార్టీల పగ్గాలు చెప్పాట్టబోతుండటం కూడా విశేషమే అని చెప్పవచ్చు. అధికార అన్నాడిఎంకె పార్టీకి శశికళ త్వరలోనే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టబోతున్నారు.