కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకి రేవంత్ రెడ్డి చురకలు!

పెద్ద నోట్ల రద్దుపై ఈరోజు శాసనసభలో జరుగుతున్న చర్చలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నోట్ల రద్దు చేశారని ముఖ్యమంత్రి చేసిన స్టేట్ మెంట్ ని సరిదిద్దుకోవలసి ఉంది. పెద్ద నోట్లని పూర్తిగా రద్దు చేస్తున్నామని కేంద్రప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. పాత వాటిని ఉపసంహరించుకొని వాటి స్థానంలో కొత్తనోట్లు ప్రవేశపెడుతున్నామని మాత్రమే చెప్పింది. కనుక దీనిని నోట్ల రద్దు అని ముఖ్యమంత్రి అనడం సరికాదు,” అని అన్నారు. 

దాని పర్యవసానాల గురించి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా తొందరపాటు నిర్ణయం తీసుకొందని దాని వలన సామాన్య ప్రజలు చాల యిబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

ఆ సమస్యని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించడం గురించి మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రప్రభుత్వం చేస్తున్న తప్పునే మళ్ళీ చేస్తోంది. ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా, ప్రజలని నగదు రహిత లావాదేవీలు చేయమని ఒత్తిడి చేయడం తగదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలోనే 72 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మిగిలినవి నగదుతోనే జరుగుతున్నాయి. కానీ సుమారు 92 శాతం నగదు లావాదేవీలే జరిగే మన దేశంలో ఇప్పటికిప్పుడు 100 శాతం నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం ఏవిధంగా సాధ్యమో పాలకులే ఆలోచించాలి. రాష్ట్రంలో అనేక చోట్ల ఇంటర్నెట్, కరెంటు కూడా లేని గ్రామాలున్నాయి. అక్కడ స్వైపింగ్ మెషిన్లు ఏవిధంగా పని చేస్తాయి?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ఈ నోట్ల రద్దు (ఉపసంహరణ) వలన కలిగిన సమస్యలపైనే సభలో చర్చించడానికే పరిమితం కాకుండా, దానిని అధిగమించడానికి పరిష్కారాల కోసం అందరూ కలిసి ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేశారు. ఇంతవరకు ఒక్క బ్యాంక్ కూడా లేని మండలాలు ఎన్నో ఉన్నాయని కనుక ప్రతీ గ్రామంలో ఒక మినీ బ్యాంకుని ఏర్పాటు చేయాలని, వీలైతే దాని నిర్వాహణ బాధ్యతలని స్థానిక మహిళా సంఘాలకి అప్పగించాలని కోరారు. తద్వారా గ్రామీణ ప్రజలు డబ్బుల కోసం ఎక్కడికోపోవలసిన బాధ తప్పుతుందని అన్నారు. రోడ్డు పక్కన ఇడ్లీలు, కూరలు అమ్ముకొనే ఒక చిరు వ్యారస్తుడు రూ.10,000 ఖరీదు చేసి స్వైపింగ్ మెషిన్ కొనుగోలు చేయలేడు కనుక ఒకవేళ ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలనుకొంటే అటువంటి చిరు వ్యాపారులు అందరికీ ప్రభుత్వమే స్వైపింగ్ మెషిన్లు ఉచితంగా అందించాలి,” అని రేవంత్ రెడ్డి సూచించారు.