రోహిత్ వేముల గురించి పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న చెప్పినట్లుగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్య గురించి ఈరోజు ట్వీట్టర్ ద్వారా తన అభిప్రాయం తెలియజేశారు. 

“దేశంలో లక్షలాది మంది ప్రజలలాగే రోహిత్ వేముల కూడా భాజపాని అసహ్యించుకోనేవాడనే విషయంలో ఎటువంటి అనుమానమూ లేదు. అయితే అతను తమను వ్యతిరేకిస్తున్నాడనో లేదా తమకి అనుకూలంగా లేడనే కారణం చేత అతనిని వేధించే హక్కు వారికి (భాజపా) లేదు. అతను యూనివర్సిటీని కాషాయీకరణ చేయడాన్ని ప్రజాస్వామిక విధానంలోనే తన నిరసనను తెలియజేస్తున్నప్పుడు వేధించడం ఇంకా తప్పు. అతని చర్యని యూనివర్సిటీలో రెండు వర్గాల విద్యార్ధుల మద్య ఒక అంశంపై భిన్నభిప్రాయలు చూడాలి. ఒకవేళ అతని వలన శాంతి భద్రతలకి భంగం కలిగినట్లయితే యూనివర్సిటీ అధికారులు పోలీసుల ద్వారా అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ యూనివర్సిటీ అధికారులు అతనిపై తీసుకొన్న కొన్ని చర్యలు అతనిని ఆత్మహత్యకి పురికొల్పాయి. ఆ సమయంలో అతని స్వంత వర్గంలో వారు కూడా అండగా నిలబడకపోవడంతో అతను మానసికంగా ఇంకా బలహీనపడ్డాడు. రోహిత్ ఆగ్రహానికి, నిరాశకి కారణం సమాజంలో నెలకొని ఉన్న తీవ్ర అసమానతలే. రోహిత్ వేములకి మానవత్వంతో కూడిన కౌన్సిలింగ్ ఇచ్చి ఉండి ఉంటే బహుశః అటువంటి తెలివైన, వేదాంత ధోరణి గల విద్యార్ధి ప్రాణాలను కాపాడబడేవేమో? రోహిత్ వేముల ఆత్మహత్యకి సంబంధించి అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఆ సంఘటన నుంచి రాజకీయ మైలేజి కోసం ప్రాకులాడితే, అతను దళితుడు కాడని నిరూపించడానికే భాజపా చాలా ఆరాటపడింది. వారిలో ఎవరూ కూడా మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలనే విషయం గురించి మాట్లాడలేదు. మన యూనివర్సిటీలు యుద్దభూములుగా కాకుండా ఉన్నత విద్యాప్రమాణాలకి నిలయంగా మారాలని కోరుకొంటూ ఆ రోజు కోసం  ఎదురు చూస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ చేశారు.